ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రోజూ ఏదోక హింస జరుగుతూనే ఉంది. మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం జరిపిన ఘటనపై సుప్రీం కర్టు కూడా సీరియస్ అయ్యింది. రాష్ట్ర డీజీపీ హాజరు కావాలని ఆదేశించింది. మణిపూర్ లో శాశ్వత శాంతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహరహం కృషి చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
3 వేల ఇళ్ల నిర్మాణానికి ఆదేశం
మణిపూర్ ను ఆదుకోవాలని కేంద్రంలోని మోదీ నేతృత్వం ఎన్డీయే సర్కారు డిసైడైంది. దుండగులు 4,500 ఇళ్లను తగులబెట్టారు. దానితో జనం నిలువనీడలేక సహాయ శిబిరాలు, పాఠశాలలు, చర్చిలు, కమ్యూనిటీ కేంద్రాలు, ప్రభుత్వ బంగ్లాల్లో తలదాచుకుంటున్నట్లు కేంద్రం గుర్తించింది. వారికి 3 వేల ఇళ్లు కట్టి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షల వ్యయంతో రెండు గదులు, ఒక బాత్ రూమ్ ఉన్న ఇంటిని నిర్మించి ఇస్తారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇళ్లు ఉంటాయి. . బట్టలు,ఇంటి సామాన్లు కొనుక్కునేందుకు ఆర్థిక సాయం కూడా ఈ ప్యాకేజీ కిందకే వస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. 360 వేర్వేలు రకాల సహాయ శిబిరాల్లో ఉంటున్న 56 వేల మందికి బట్టలు,ఇంటి సామాన్లు కొనుక్కునేందుకు ఆరు కోట్ల రూపాయలు కేటాయిస్తారు. దుండుగులు దాడి చేసి వాళ్లు సామాన్లు తీసుకునే లోపే ఇళ్లు తగులబెట్టడంతో కట్టుబట్టలతో జనం పారిపోయారు.
వ్యవసాయ పనులకు ప్యాకేజీ
అల్లర్లతో రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ పరికరాలు దెబ్బతిన్నాయి. మళ్లీ వ్యవసాయ పనులు ప్రారంభించాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. దానితో వ్యవసాయదారులకు రూ.38.6 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాపారాలు నష్టపోయిన వారికి కూడా ఆర్థికసాయంతోపాటు బ్యాంకు లోన్లు ఇప్పిస్తారు. వ్యాపారులకు తగిన భద్రత కల్పిస్తామని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి.
కంప్యూటర్లు, ఆన్ లైన్ క్లాసులు
సహాయ శిబిరాల్లో టీవీలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. పంచాయతీ కార్యాలయాల్లో టీవీలు పెడితే యువత సమాచారం పొందేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. పైగా హింస కారణంగా బడులు మూతబడిన వారికి ఆన్ లైన్ తరగతులు కొనసాగించేందుకు కూడా ఈ టీవీ సెట్స్ ఉపయోపడొచ్చు. వెయ్యి కంప్యూటర్లు అందంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. దీని వల్ల జనానికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. యువత ఉద్యోగాన్వేషణకు ఉపయోగపడుతుంది. కంప్యూటర్ల పంపిణీ కార్యక్రమానికి రూ.11 కోట్ల వరకు వ్యయం చేస్తారు.