మణిశంకర్ అయ్యర్ ప్రేలాపనలు

అపర మేధావిగా తనను తాను పరిగణించే కాంగ్రెస్ మాజీ ఎంపీ మణిశంకర్ అయ్యర్ తరచూ దేశ వ్యతిరేక ప్రకటనలు చేస్తుంటారు. ఉచ్చనీచాలు చూడకుండా ఆయన ఏదేదో మాట్లాడేస్తుంటారు. జాతిని, జాతిప్రజలను కించపరిచే మాటలు మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రం పాకిస్థాన్ ను ప్రశంసిస్తుంటారు. అదేమని అడిగితే అంతా నా ఇష్టం అన్నట్లుగా సమాధానమిస్తుంటారు. పోనీ ఆయన మాటలు సహేతుకంగా ఉంటాయా అంటే అదీ లేదు. చివరకు ఆయన వితండవాదిగానే మిగిలిపోతారు..

పాకిస్థాన్ వెళ్లి మరీ..

మణిశంకర్ అయ్యర్ ఇటీవల పాకిస్థాన్ వెళ్లారు. అక్కడ అనేక చోట్ల ప్రసంగించారు. పాకిస్థాన్ పట్ల భారత వైఖరిని నిస్సుగ్గుగా వ్యతిరేకించారు.పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులను తప్పుపట్టారు. అది భారత ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు అన్నట్లుగా ఆయన విశ్లేషించారు.ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వంతో చర్చలకు భారత ప్రభుత్వం దూరంగా ఉంటే దాన్ని కూడా ఆయన పెద్ద నేరంగా మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేంత వరకు చర్చలు ఉండవని, పాక్ వైఖరి మారితేనే చర్చలకు అవకాశం ఉంటుందని భారత విదేశాంగ శాఖ తరచూ చెబుతున్న సంగతి ఆయన మరిచిపోయినట్లున్నారు….

భారత్ కు ధైర్యం లేదా…

మణిశంకర్ అయ్యర్ వాడిన పదజాలం కూడా ఆక్షేపణీయంగా ఉంది. సర్జికల్ దాడులు చేసే ధైర్యం ఉంది కానీ, చర్చలకు వచ్చే ధైర్యం లేదని మోదీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. అసలు ధైర్యం అనే మాటకు అర్థం తెలుసా అని భారతీయులు మణిశంకర్ అయ్యర్ ను ప్రశ్నిస్తున్నారు. ధైర్యానికి నిలువెత్తు రూపంగా నిలిచే ప్రధాని మోదీని అనాల్సిన మాటేనా అని వారు అడుగుతున్నారు. మనం వ్యతిరేకిస్తే వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారంటూ పాకిస్థానీయులను ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారాయన.దొంగదెబ్బ తీయడానికే ప్రాధాన్యమిచ్చే పాకిస్థానీయులు ధైర్య సాహసాలు ఎలాంటివో అందరికీ తెలిసినప్పటికీ అయ్యర్ కేవలం వారి మెప్పుపొందేందుకే భారతీయులను కించపరిచే విధంగా మాట్లాడారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి..

వివాదాస్పద కామెంట్స్ తో పరువు తీసే నాయకుడు

మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద కామెంట్స్ తో కాంగ్రెస్ పార్టీ పరువు తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2017 ప్రాంతంలో ప్రధాని మోదీ పట్ల ఆయన పరుష పదజాలాన్ని ప్రదజాలాన్ని వాడారు. దానితో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యారు. తర్వాత వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న ఆయన తనకు హిందీ రాకపోవడం వల్ల మాట జారాల్సి వచ్చిందని చెప్పుకున్నారు. అప్పట్లో గుజరాత్ రెండో విడత ఎన్నికల వేళ ఆయన వ్యాఖ్యలు పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ నుండి మణిశంకర్ అయ్యర్‌ను సస్పెండ్ చేసింది. ఐనా ఆయన తీరు మారలేదు. ఎప్పుడేం చేస్తాడో ఆయనకే తెలీదు..