ఇండియా గ్రూపుపై మమత గుస్సా

మమత డిసైడయ్యారా. ఇండియా గ్రూపు నుంచి విడిపోవాలనుకుంటున్నారా. ఆ దిశగా కొంత పరోక్షంగా, కొంత ప్రత్యక్షంగా సంకేతాలిచ్చారా. మిత్రపక్షాల తీరు శత్రు పక్షంలా ఉందని ఆమె తీవ్ర ఆవేదన చెందుతున్నారా.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఆమె ఇటీవలి ప్రసంగాలే సమాధానాలిస్తున్నాయి….

సన్హాతీ ర్యాలీతో మమత తీరు సుస్పష్టం….

మమతా బెనర్జీ.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లలేదు. అయోధ్యలో క్రతువు జరుగుతున్న వేళ ఆమె కోల్ కతాలో సన్హాతీ ర్యాలీ నిర్వహించారు. ఒక ఆలయం, ఒక మసీదు, ఒక చర్చిని సందర్శించి ప్రార్థనలు, పూజలు చేశారు. ఆమెతో పాటు ఆమె మేనల్లుడైన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగానే ఆమె కూటమి పార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా గ్రూపు అన్న పేరును తానే సూచించానని .. చివరికి తొలి మీటింగులోనే కమ్యూనిస్టులు కంట్రోల్ చేస్తూ కనిపించారని ఆమె అన్నారు. ఎవరైనా బీజేపీకి సాయం చేయాలనుకుంటే తాను సహించే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు..

రాహుల్ తీరుపై ఆగ్రహం…

కాంగ్రెస్ పార్టీ సీపీఎం వైపు మొగ్గు చూపుతోందని ఆమె అసహనానికి లోనవుతున్నారు. 34 ఏళ్ల పాటు తాను కమ్యూనిస్టులపై పోరాడితే ఇప్పుడు వారిని కలుపుకుపోయేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు. పైగా ఒక ఆలయానికి వెళితే సరిపోతుందా మసీదుకు, చర్చికి వెళ్లొద్దా అని ఆమె ప్రశ్నిస్తున్నారు.ఇదీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రయోగించిన అస్త్రమని రాజకీయ వర్గాల్లో విశ్లేషణ వినిపిస్తోంది. ఆయన రెండు రోజుల క్రితం అసోంలో ఓ ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించి వివాదం సృష్టించారు. కాంగ్రెస్ తీరు పట్ల తాను సంతృప్తిగా లేనని చెప్పేందుకే దీదీ ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తున్నారని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

విడిగా పోటీకి ఏర్పాట్లు

మమత బెనర్జీ చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలపై విసుగు చెంది ఉన్నారు. అందుకే పశ్చిమ బెంగాల్లోని 42 లోక్ సభా స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేయాలని తమ పార్టీ వారిని ఆమె ఆదేశించారు. సీపీఎంకు కొన్ని సీట్లు వదిలేయ్యడం మమతకు ఏ మాత్రం ఇష్టం లేదు. సీపీఎంను వెనుకేసుకు వస్తున్నారన్న ఆగ్రహంతో కాంగ్రెస్ ను దూరం పెట్టేందుకు ఆమె వెనుకాడరన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈ నెల 25న బెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ ర్యాలీకి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉండదని, మద్దతుగా పార్టీ నేతలు వెళ్లే అవకాశం లేదని మమత పరోక్ష సంకేతాలిచ్చారు. అదే జరిగితే ఇండియా గ్రూపు తీరును ఎద్దేవా చేసేందుకు బీజేపీకి ఒక అస్త్రం దొరికినట్లే అవుతుంది. మరో పక్క మమత దూరంగా జరిగితే ఇండియా గ్రూపులో తృణమూల్‌ ను భాగస్వామిగా కొనసాగించేందుకు రాహుల్ గాంధీ ఒప్పుకుంటారో లేదో చూడాలి….