పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుంది. రాష్ట్రంలోని 42 లోక్ సభా స్థానాల్లో మెజార్టీ చోట్ల బీజేపీ గెలుస్తుందని, కమలం పార్టీకి గత ట్యాలీ కంటే ఎక్కువగా వస్తాయని దీదీ గుర్తించారు. దానితో ఆమె ఓటరు దేవుళ్లను తమ వైపుకు తిప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. బీజేపీపై టన్నుల కొద్దీ బురద జల్లే క్రమంలో ఇతర వర్గాలపై కూడా ఆరోపణలు సంధిస్తున్నారు. అవీ బూమరాంగ్ అవుతున్నాయి..
రామకృష్ణా మఠంపై ఆరోపణలు
రామకృష్ణా మఠంలోని సన్యాసులు (మాంక్స్) బీజేపీ కోసం పనిచేస్తున్నారట. భారత సేవాశ్రమ్ సంఘ, ఇస్కాన్ సంస్థల్లో ఉన్న మాంక్స్ కూడా అంతేనట. ఈ మాట అన్నది ఎవరో కాదు. ముందు వెనుక చూసుకోకుండా, మంచి చెడు ఆలోచించకుండా సీఎం మమతా బెనర్జీ ఈ డైలాగ్స్ వదిలారు. ఢిల్లీలోని బీజేపీ నేతల ఆదేశాల మేరకు రామకృష్ణా మిషన్ మాంక్స్ పనిచేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఆలయాల పవిత్రతను కాపాడటంలో చాలా మంది అంకితభావంతో పనిచేస్తున్నారని, కొందరు మాత్రం కేంద్ర ప్రభుత్వంలోని పార్టీ కోసం పనిచేస్తున్నారని మమత దీదీ ప్రధాన ఆరోపణ.
తృణమూల్ అన్ని మర్యాదలు వదిలేసిందన్న మోదీ…
మమత బెనర్జీ తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ అన్ని హద్దులను దాటేసిందని, అన్ని మర్యాదలను గాలికి వదిలేసిందని పురులియా బహిరంగ సభలో ఆయన ఆరోపించారు. రామకృష్ణా మిషన్, ఇస్కాన్ పై దుష్ర్పచారాలకు దిగారని ఆయన విరుచుకుపడ్డారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రామకృష్ణా మిషన్, ఇస్కాన్ ను బెదిరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. అలాంటి ప్రయత్నాలను సహించేది లేదన్నారు…
హైకోర్టుకు వెళతామంటున్న మాలవీయ
మమత దీదీ ఆరోపణలను బీజేపీ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. బెంగాల్ ప్రజలను తప్పుతోవ పట్టించేందుకు మమత ప్రయత్నిస్తున్నారని బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంతా మజుందార్ ఆరోపించారు. దేశ భవిష్యతు కోసం సేవలు చేస్తున్న సంస్థలపై బురదజల్లడం సరికాదన్నారు. బెంగాల్ ప్రజలను రెచ్చగొట్టే చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. గతేడాది ఆమె ప్రకటనలను గుర్తుచేసుకుంటే ఎవరు తప్పుతోవ పట్టిస్తున్నారో అర్థమవుతుందని మజుందార్ అభిప్రాయపడ్డారు. ముస్లింలంతా టీఎంసీకి మాత్రమే ఓటెయ్యాలని ఆమె కోరినట్లు ఆయన గుర్తుచేశారు. భారత సేవాశ్రమ్ కు చెందిన కార్తీక్ మహారాజ్ పై ఆమె చేసిన ఆరోపణలను బెంగాల్ ప్రజలంతా అసహ్యించుకుంటున్నారన్నారు. సంఘ్ ప్రతినిధులు త్వరలో ఆమెపై కేసు వేస్తారని బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్ అమిత్ మాలవీయ ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో అల్లర్లు జరిగినప్పుడు హిందువులను కాపాడిన ఘనత భారత్ సేవాశ్రమ్ సంఘ్ కు దక్కుతుందని మాలవీయ అన్నారు . మమత ఆరోపణలకు వ్యతిరేకంగా త్వరలో బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఇలాంటి ఆరోపణలనే బెంగాల్ ఇమామ్స్ అసోసియేషన్ ఛైర్మన్ మొహ్మద్ యాహ్యాపై మమత సంధించగలరా అని మాలవీయ అడిగిన ప్రశ్నకు తృణమూల్ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు.