పార్టీల జయాపజయాలను నిర్దేశించే మాల్వా – నీమర్

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎవరు గెలుస్తారో ఇప్పుడే చేప్పలేనంత ఉత్కంఠ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకుంటామని బీజేపీ చెబుతున్నప్పటికీ అది అంత సులభం కాదన్న వాదన వినిపిస్తోంది. ఇంత టెన్షన్ నడుమ ఒక ప్రాంతం మాత్రం అత్యంత కీలకం కానుంది.

కీలకం కానున్న 66 సీట్లు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వేర్వేరు ప్రాంతాల్లో మాల్వా – నీమర్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గత ఎన్నికలు మినహా ప్రతీ సారీ బీజేపీకి ఇక్కడి 66 సీట్లలో అత్యధిక స్థానాలే దక్కుతున్నాయి. 2018 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి 29 స్థానాలు మాత్రమే రాగా కాంగ్రెస్ 34 దక్కాయి. మరో మూడు చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. 2013లో అయితే బీజేపీ ఏకంగా 56 చోట్ల గెలిచింది. మాల్వా – నీమర్ ప్రాంతంలో ఎక్కువ సీట్లు వస్తే అధికారం చేజిక్కుతుందన్న నమ్మకమూ ఉంది.

పెద్దగా ప్రభావం చూపని జోడో యాత్ర

ఇక్కడి గిరిజన జిల్లాలైన ఝాబువా, ధార్, అలీరాజ్పూర్, రాట్లం, బర్వానీలో కాంగ్రెస్ కు కొంత బలమున్న మాట వాస్తవం, గతేడాది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ ప్రాంతం గుండానే సాగింది. ఐనా బీజేపీ మాతృక అయిన ఆరెస్సెస్ ఇక్కడ వేళ్లూనుకోవడంతో అధికార పార్టీకి మంచి మద్దతే లభిస్తోంది. అయితే చెప్పుకోవాల్సిన విషయం మరోకటి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మాల్వా – నీమర్ ప్రాంతంలో 34 స్థానాలు వచ్చినా 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. నిజానికి మధ్య ప్రదేశ్ మొత్తం మీద ఆ పార్టీకి వచ్చిందీ కేవలం ఒక్క స్థానమే…

రైతులు, గిరిజన ఓట్లే ప్రథానం

మాల్వా – నీమర్ ప్రాంతంలోని 66 నియోజకవర్గాల్లో 22 షెడ్యూల్ తెగపలకు కేటాయించారు. గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడుతుండగా,ఇతర సామాజిక వర్గాల వాళ్లలో కూడా ఎక్కువ మంది వ్యవసాయం చేస్తున్నారు. 2018లో గిరిజన సీట్లలో కాంగ్రెస్ 14 గెలవగా, బీజేపీ ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. 2013లో బీజేపీకి మాల్వాలో 16 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఐదు చోట్ల మాత్రమే గెలిచింది. కేంద్ర మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే కాంతిలాల్ భూరియాపైనే పార్టీ అన్ని ఆశలు పెట్టుకుంది. నోరు జారే తత్వమున్న 73 ఏళ్ల భూరియా.. ఇటీవల ప్రధానమంత్రి మోదీ పట్ల చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. మాల్వా గిరిజనులను ఆకట్టుకునేందుకు బీజేపీ తనదైన శైలిలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇటీవలే భారీ స్థాయిలో ట్రైబల్ ఫెస్టివల్ ఏర్పాటు చేసింది. రైల్వే స్టేషన్లకు గిరిజన నేతల పేర్లు పెట్టింది. ఈ ఏడాది జూలైలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కూడా అక్కడే నిర్వహించింది అందుకే తాము గెలుస్తామన్న ధీమా ఆ పార్టీకి ఉందని చెప్పాలి…