తాజా సంక్షోభంలో మాల్దీవ్స్ ద్వంద్వ వైఖరి…

ఎంత జరిగినా కొంత మందికి, కొన్ని దేశాలకు బుద్ధి రావడం అంత ఈజీ కాదు. కింద పడినా పైచేయి మాదేనని వాళ్లు చెప్పుకుంటుంటారు. మాల్జీవ్స్ కూడా అంతేననుకోవాలి. ప్రధాని మోదీ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి అభాసుపాలైనప్పటికీ వారి తీరు మారడం లేదు. ఇంకా అతి తెలివితేటలనే ప్రదర్శిస్తున్నారు. మిత్రభేదం తరహాలో గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తూన్నారు. అలాంటి ఆటలు సాగవని తెలిసి కూడా తమ ప్రయత్నాలను మానకోవడం లేదు..

టూరిస్టు ఆపరేటర్లతో అభ్యర్థన

భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీని కించపరిచే విధంగా మాల్దీవ్స్ మంత్రులు వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశమే ఏకమై ఖండించింది. భారత సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాల్దీవ్స్ కు టూరిజం బుకింగులు నిలిపివేస్తున్నట్లు ఈజ్ మై ట్రిప్ సంస్థ ప్రకటించింది. జనం కూడా ఆ దేశ పర్యటనను రద్దు చేసుకున్నారు. పది వేల హోటల్ బుకింగులు, ఎనిమిది వేల ఫ్లైట్ టికెట్లు రద్దయ్యాయి దానితో మాల్దీవ్స్ దారికి వచ్చినట్లే కనిపించింది. మాల్డీవ్స్ టూర్ ఆపరేటర్ల సంఘం (మటాటో) ఇప్పుడు ఈజ్ మై ట్రిప్ సహా పలు సంస్థలకు విజ్ఞప్తులు చేస్తోంది. సోదరభావంతో పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుతోంది. రాజకీయ పరంగా చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని, దాని వల్ల పర్యాటకరంగంపై ఆధారపడి బతికే 44 వేల మంది జీవనోపాధికి ఆటంకం ఏర్పడే చర్యలు వద్దని వేడుకుంటోంది. పర్యాటక పరిశ్రమే తమకు జీవనాధారని,ప్రతీ ఏటా రెండు లక్షల మంది వచ్చే భారతీయ పర్యాటకులు ఆగిపోతే తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని కూడా విజ్ఞప్తి చేస్తోంది…

చైనా వైపు చూస్తున్న మాల్దీవ్స్

మాల్డీవ్స్ టూరిస్టు ఆపరేటర్లు ఒక పక్క భారత పర్యాటకుల రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే ఆ దేశ ప్రభుత్వ వైఖరి మాత్రం మరోలా ఉంది. చైనా నుంచి ఎక్కువ మంది పర్యాటకుల కోసం ఎదురుచూస్తున్నట్లు మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయ్జూ ప్రకటించారు. డ్రాగన్ కంట్రీ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ పాలకులను దువ్వేందుకు ప్రయత్నించారు. అంతర్గత టూరిజం జోన్ అభివృద్ధికి చైనాతో ఆయన 50 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నారు. చైనా బెల్డ్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అంటే చైనాతో పూర్తి స్థాయి సంబంధాలను పెంచుకుని భారత్ ను దూరం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధ్యక్షడు మొహమ్మద్ సంకేతమిచ్చారు…

గతాన్ని మరిచిన మాల్దీవ్స్….

1980ల్లో గయూమ్ ఆ దేశ అధ్యక్షుడిగా ఉండేవారు. అప్పుడు 80 మంది సాయుధ కిరాయి సైనికులు ఆ దేశంలోకి చొరబడి అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన అధ్యక్షుడు గయూమ్.. సాయం కోసం చైనా, అమెరికాను సంప్రదించినా వాళ్లు స్పందించలేదు. ఇండియాను కోరిన వెంటనే నావికాదళంతో పాటు సైన్యాన్ని పంపింది. దానికి ఆపరేషన్ కాక్టస్ అని పేరు పెట్టారు. భారత సైన్యాలు దిగిన వెంటనే ముష్కరులు పారిపోయారు. గయూమ్ ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టిన భారత సైన్యం… పారిపోయిన కిరాయి సైనికులను సైతం పట్టుకొచ్చి మాల్డీవ్స్ ప్రభుత్వానికి అప్పగించింది.ఇంత సాయం చేసినా ప్రస్తుత మాల్దీవ్స్ ప్రభుత్వం మాత్రం చైనా వైపుకు చూస్తోంది…