మెజార్టీదే బలం – తేల్చేసిన మహారాష్ట్ర రాజకీయం

ప్రజాస్వామ్యంలో మెజార్టీ వర్గాలదే పాలన. ప్రజలు ఎవరికి మెజార్టీ ఇచ్చి అధికారంలో కూర్చోబెడతారో వారికే పాలనా హక్కు ఉంటుంది. రెండు వర్గాల శివసేన వర్గాల మధ్య జరిగిన వివాదంలో మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ చెప్పిన నిజం ఇది. ఉద్ధవ్ సేన పంతానికి పోయి పరువు పోగొట్టుకున్న సంగతి కూడా స్పీకర్ తీర్పుతో తేటతెల్లమైంది..

షిండే వైపు 37 మంది ఎమ్మెల్యేలు

18 నెలల క్రితం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నిరంకుశ వైఖరికి నిరసనగా మెజార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన మెజార్టీ వర్గం నాయకుడు ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యేందుకు బీజేపీ ఒప్పుకుంది. నాలుగు రోజుల్లో ప్రభుత్వం దిగిపోతుందని ఉద్ధవ్ వర్గం నాయకుడు సంజయ్ రావత్ ఎదురు చూసినప్పటికి ఆ పని జరగలేదు. ఇప్పటి వరకు షిండే ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఇప్పుడు షిండే సేనే నిజమైన శివసేన అని స్పీకర్ నార్వేకర్ తేల్చేశారు. 54 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 37 మంది ఏక్ నాథ్ షిండే వైపు ఉన్నారని కూడా లెక్క చెప్పేశారు..

16 మందిపై అనర్హత వేటు కుదరదు..

అటు వెళ్లిపోయిన 37 మందిలో తిరుగుబాటుకు 16 మంది కారణమని ఉద్ధవ్ సేన తేల్చింది. వారిని ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు దరఖాస్తు చేసుకుంది. అయితే అలాంటి ఆధారాలేమీ లేనందున వారిపై వేటు వేయడం కుదరదని స్పీకర్ తేల్చేశారు. షిండే వర్గమే నిజమైన శివసేన అయినందున వారిపై ఎలా వేటు వేస్తామని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. పైగా ఉద్ధవ్ వర్గానికి చెందిన సునీల్ ప్రభును విప్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి.. మరో దెబ్బకొట్టారు. 2022 జూన్ 21 నుంచి షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలే మాత్రమే శివసేనకు విప్ గా ఉంటారని అన్నారు.

తొలగించే అధికారం మీకు ఎక్కడిది..

మెజార్టీ కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రేకు ఎలాంటి హక్కులు ఉండవని స్పీకర్ తేల్చారు.ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ఆయనకు లేదన్నారు. నిజానికి ఉద్ధవ్ వర్గం తప్పుల మీద తప్పులు చేసి కష్టాలు కొనితెచ్చుకుంది. 2018లో పార్టీ రాజ్యాంగానికి మార్పులు చేసినప్పుడు దాన్ని కేంద్ర ఎన్నికల సంఘంలో నమోదు చేయలేదు. దానితో 1999లో ఈసీ ముందు నమోదు చేసిన పార్టీ రాజ్యాంగం మాత్రమే చెల్లుబాటు అవుతుందని తన రూలింగ్ కూడా దాని ప్రకారమే అమలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. శివసేన రాజ్యాంగం ప్రకారమే షిండేకు పార్టీలో ఫుల్ పవర్స్ వచ్చాయన్నారు. ఇప్పుడు అన్ని విధాలుగా ఇరకాటంలో పడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం పరువు కాపాడుకునే దిశగా సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది.