మహదేవ్ యాప్ బెట్టింగ్ కార్యకలాపాలపై అనేక విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. దుబాయ్ కేంద్రంగా ఛత్తీస్ గడ్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బెట్టింగ్ కార్యకలాపాలతో వేల కోట్లు సంపాదించిన ప్రమోటర్లు ఆ సొమ్మును భారత స్టాక్ మార్కెట్లలోనే పెట్టుబడి పెట్టినట్లు తేలింది. తవ్వేకొద్దీ కొత్త నిజాలు బయటకు వస్తున్నాయని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు అంటున్నాయి….
నిందితుల వద్ద రూ,1,186 కోట్ల షేర్లు
మహదేవ్ ఆన్ లైన్ బుక్ అనేది అక్రమంగా నడిచిన బెట్టింగ్ యాప్. దీనితో డబ్బులు పెడితే భారీగా లాభాలు వస్తాయని విస్తరించిన పలువురు డబ్బులు పోగొట్టుకున్నారు. తక్కువలో తక్కువ యాప్ నిర్వహాకులు రూ.20 వేల కోట్ల వరకు సంపాదించి ఉంటారని ఓ అంచనా. ఛత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి భుపేష్ భాగెల్ పైన కూడా మహదేవ్ యాప్ కు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుల్లో నిందితులు భారత సెక్యూరిటీల్లో రూ.1,186 కోట్లు పెట్టుబడి పెట్టారని ఈడీ గుర్తించింది…
రూ. 580 కోట్లు జప్తుచేసిన ఈడీ…
స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఈడీ ఇప్పటికే రూ. 580 కోట్లు జప్తు చేసింది. రూ.606 కోట్ల రూపాయలకు వరకు మరో మార్గంలో ఇన్వెస్ట్ చేశారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల రూపంలో ఈ సొమ్మును కీలక స్టాక్స్ లో చొప్పించారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న కోల్ కతా వ్యాపారి హరిశంకర్ టిబ్రేవాల్ ఈ సొమ్మును పెట్టుబడిగా పెట్టడంలో కీలక భూమిక పోషించాడు. చాలా తెలివిగా ప్రధాన స్టాక్స్ లోనే పెట్టుబడి పెట్టాడు. మహదేవ్ యాప్ ప్రమోటర్లయిన సౌరబ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ కు అతను వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. ప్రమోటర్లు ఇద్దరు ఇప్పుడు దుబాయ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. వారిని భారత్ కు అప్పగించే ప్రక్రియ వేగం పుంజుకుంది…
షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులకు కారణమా…
వ్యాపారి హరిశంకర్ టిబ్రేవాల్ పై ఈడీ మరో అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తోంది. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరల పెరుగుదల, తగ్గుదలకు సంబంధించి అతను లాలూచీ వ్యాపారం చేశాడని ఈడీ అనుమానిస్తోంది. కొన్ని స్టాక్స్ ధరలు భారీగా పెరగడం వెనుక హరిశంకర్ గేమ్ ప్లాన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో రేట్లు పెరిగిన వెంటనే అవసరాన్ని బట్టి క్రయ విక్రయాలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో మార్కెట్ నే అతను తప్పుదోవ పట్టించినట్లు అనుమానిస్తున్నారు. మహదేవ్ యాప్ కు సంబంధించిన ఇప్పటి వరకు రూ. 1,700 కోట్లు జప్తు చేసినట్లు ఈడీ చెబుతోంది…..