రాష్ట్రంలో ఎవరు పాపులర్ అంటే ఎక్కడైనా ముఖ్యమంత్రి పేరు లేదా ప్రతిపక్ష నాయకుడి పేరు చెప్పాలి. ఎన్నికలు జరిగే మధ్య ప్రదేశ్లో మాత్రం ప్రధాని మోదీ పేరు చెబుతున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రశంసిస్తూనే .. మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం సాయాన్ని మధ్యప్రదేశ్ ప్రజలు గగుర్తు చేస్తున్నారు.
ఛంబల్ -గ్వాలియర్ లో మోదీ హవా
మధ్యప్రదేశ్లోని కీలక ప్రాంతం ఛంబల్ గ్వాలియర్ రీజియన్ లో ఎవరిని పలుకరించిన నరేంద్ర మోదీ నాయకత్వాన్నే ప్రశంసిస్తున్నారు. 18 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దించి కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టాలని కొందరు మాత్రమే కోరుకుంటుంండగా.. మెజార్టీ వర్గం మోదీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించుకుంటామని అంటోంది. రోడ్లు, విద్యుత్, నీటి సరఫరాలో శివరాజ్ ప్రభుత్వ సేవలు ప్రశంసనీయమని జనం అంటున్నారు. స్థూలంగా అభివృద్ధి జరిగిందని, మధ్యలో 15 నెలల పాటు ఉన్న కమల్ నాథ్ సర్కారుతో ఇబ్బంది పడ్డామని ఛంబర్ – గ్వాలియర్ వాసులు చెబుతున్నారు.
అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేదు..
శివరాజ్ ప్రభుత్వంలో అవినీతి లేదని, ఒకరిద్దరు కింది స్థాయి అధికారులు అవినీతి చేసినా ప్రభుత్వం వాటిని కట్టడిలోకి తెచ్చిందని మధ్యప్రదేశ్ జనం ఒప్పుకుంటున్నారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన సీఎం హెల్ప్ లైన్ నెంబర్ 181 సమర్థంగా పనిచేస్తోందని జనం కితాబిచ్చారు. ఒకటి రెండు సార్లు కాల్ సెంటర్ లో నిర్లక్ష్యంగా సమాధానం వచ్చినా మొత్తం మీద ఫిర్యాదులు పరిష్కారమయ్యాయన్నారు. వీటితో పాటుగా శివరాజ్ ప్రభుత్వం అమలు చేస్తున్న లాడ్లీ బెహన్ యోజన, కేంద్ర ప్రభుత్వ నగదు బదిలీ కారణంగా లక్షలాది మంది రైతులు బాగుపడ్డారు. నగదు బదిలీ కారణంగా పురుషుల చేతికి డబ్బులు వస్తే లాడ్లీ బెహన్ యోజన కారణంగా మహిళలు ప్రయోజనం పొందారు.
కుల గణన అవసరం లేదు..
మధ్యప్రదేశ్ ప్రజలు కులగణన అసలు అవసరమే లేదని ప్రకటించేస్తున్నారు. ప్రస్తుతం కుల గణన జరిపిన బిహార్ వేరు.. తమ రాష్ట్రంలోని పరిస్థితుుల వేరని వాళ్లు లెక్కగట్టారు. ఉత్తర ప్రదేశ్లో కూడా కుల గణన అవసరమని ఒప్పుకుంటూనే దాని ద్వారా ఒనగూరే ప్రయోజనం లేదని తేల్చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల సత్వర, సమర్థ అమలు కోసం కుల గణన చేపడుతున్నప్పుడు అసమర్థతకే అవకాశం లేని మధ్యప్రదేశ్లో వాటి అవసరమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చంబల్ – గ్వాలియర్ ప్రాంతంలో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే. గత ఎన్నికల్లో అక్కడి 34 స్థానాల్లో 27 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఈ సారి బీజేపీకి ఎన్ని వస్తాయేనని జనం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గ్వాలియర్ ప్రాంతంలోని కేంద్ర మంత్రి సింథియా వర్గం బీజేపీలో చేరిపోయి చాలా రోజులైంది.