మధ్యప్రదేశ్ కాంగ్రెస్ – సొంతూరులో బలంలేని దీనస్థితి….

మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. నాయకుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఒక వంతయితే, ఫలితాలను విశ్లేషించుకుంటే పరిస్థితి దారుణంగా ఉందని తెలియడం మరో వంతు…

50 ఓట్లు కూడా రాని ఊళ్లు..

మెజార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు రాజకీయ భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. గెలుపోటములు సహజమే అయినా.. ఇంత ఘోరంగా ఓడిపోతామన్న ఆలోచన ఎప్పుడూ రాలేదని వాళ్లు చెబుతున్నారు. సొంత ఊళ్లలోనే పట్టుమని యాభై ఓట్లు రాని అభ్యర్థులు చాలా మంది ఉండటంతో పార్టీ పట్ల ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పుకుంటున్నారు. గెలిచే అవకాశాలున్నట్లు భావించినప్పుడే ఇంత ఘోరంగా విఫలమైతే, లోక్ సభ ఎన్నికల్లో ఇంకెంత నష్టపోతామోనని వాళ్లు భయపడుతున్నారు. కొందరు నేతలు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించి చేతులు దలుపుకున్నారు. అయితే ఆ వాదనను పట్టించుకునేందుకు సామాన్య జనం ముందుకు రాలేదు..

కమల్ నాథ్ దిగిపోవాల్సిందేనా…

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ ను అధిష్టానం సాగనంపుతుందన్న చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఓటమికి ఆయనే పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సి ఉంటుందని ఢిల్లీ వర్గాల సమాచారం. మధ్యప్రదేశ్ వ్యవహారంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమై చర్చించారు. ఇంకొన్ని వివరాలు తెప్పించుకోవాల్సి ఉన్నందున భేటీ అర్థాంతరంగా వాయిదా పడింది. అయితే కమల్ నాథ్ వర్గం ఇప్పుడు మైండ్ గేమ్ ఆడుతోంది. లోక్ సభ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా కమల్ నాథ్ ను కొనసాగాలని అధిష్టానం చెప్పినట్లుగా ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది.

దిగ్విజయ్ వెయిటింగ్…

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ ఇప్పుడు చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం దగ్గర ఉన్న పరపతితో ఆయన దూసుకెళ్లేందుకు వ్యూహరచమ చేస్తున్నారు. ఎంపీ కాంగ్రెస్ లో కమల్ నాథ్ వ్యతిరేక వర్గానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. పైగా తమ్ముడు లక్ష్మణ్ సింగ్ ను ఆయన కమల్ నాథ్ పై విమర్శలకు ఉసిగొల్పుతున్నారు. కమల్ నాథ్ ను తప్పించగలిగితే లోక్ సభ ఎన్నికల నాటికి తాను బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని దిగ్విజయ్ అంచనా వేసుకుంటున్నారు. అందుకే డైవర్షన్ కోసం కూడా ఈవీఎం ట్యాంపరింగ్ పేరుతో దిగ్విజయ్ గ్రూపు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు. సింథియా వర్గం బీజేపీలోకి వెళ్లిపోయిన తర్వాత దిగ్విజయ్ కు కమల్ నాథ్ ఒక్కరే అడ్డంకిగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్ నాథ్ వల్లే రాష్ట్రంలో ఓడిపోయామని, ఆయన అందరినీ కలుపుకుపోవడం లేదని దిగ్విజయ్ గ్రూపు ప్రచారం చేస్తోంది…