ఉమ్మడి మధ్యప్రదేశ్ నుంచి విభజిత రాష్ట్రం వరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రోజురోజుకూ బలపడుతూ ఉంది. రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనకు ప్రజలు ఫుల్ మార్క్స్ వేయడం, కేంద్ర పార్టీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాష్ట్రానికి కావాల్సిందంతా అందించడంతో కార్యకర్తలు సంతోషంగా పనిచేస్తున్నారు. డిసెంబరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటామని చెబుతున్నారు..
తొలి నుంచి 30 శాతం ఓట్ షేర్…
ఏ రకంగా చూసినా మధ్యప్రదేశ్ భారతీయ జనతాపార్టీకి కంచుకోటగానే కనిపిస్తోంది. గుజరాత్ తర్వాత బీజేపీ 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ మాత్రమేనని చెప్పాలి. అది ఒక్క రోజులో సాధించిన పేరు మాత్రం కాదని గుర్తుచేసుకోవాలి. అప్పటి జనసంఘ్ కాలం నుంచి ఉమ్మడి మధ్యప్రదేశ్లో పార్టీ బలంగానే ఉంది. 1967లో జన సంఘ్ కు 30 శాతం ఓట్ షేర్ వచ్చినప్పటికీ నాటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పోటీ పడలేక ఓడిపోయింది.
2003 తర్వాత తిరుగులేని బీజేపీ..
1980లో బీజేపీ ఏర్పాటైన తర్వాత ప్రతీ ఎన్నికలోనూ పార్టీకి ఆటుపోట్లు తప్పలేదు. 2003 తర్వాత మాత్రం శివరాజ్ నాయకత్వంలో పార్టీకి మహర్దశ పట్టిందనే చెప్పాలి. 1990లో 39 శాతం ఓట్ షేర్ తో సొంత మెజార్టీపై బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి కంటే ఇప్పుడు పార్టీ పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో దెబ్బకొట్టి బీజేపీ సెటిలైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటిగా చెప్పొచ్చు..
2018లో విచిత్ర పరిస్థితి…
బీజేపీ ధైర్యమేంటి అని అడిగితే అది పెద్ద ప్రశ్నే. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూపి కాంగ్రెస్ సంతోష పడటానికి కూడా వీల్లేదన్నది నిర్వివాదాంశం. 2018లో కాంగ్రెస్ పార్టీకి ఐదు అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా వచ్చాయి. కాకపోతే బీజేపీ ఓట్ షేర్ హస్తం పార్టీ కంటే చాలా ఎక్కువేనని గణాంకాలను చూస్తే అట్టే అర్థమవుతుంది.బీజేపీ స్వల్పకాలం అధికారాన్ని పోగొట్టుకుని మళ్లీ చేజిక్కించుకుంది. లోక్ సభ ఎన్నికల్లో మోదీ హవాతో మధ్యప్రదేశ్ ను బీజేపీ రెండు సార్లు క్లీన్ స్వీప్ చేసింది.
ఈసారి బీజేపీకి అడ్వాంటెజ్…
2018 అసెంబ్లీ ఎన్నికలను పోల్చుకుని బీజేపీకి కష్టకాలం ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే అత్యంత శక్తిమంతమైన సింథియా కుటుంబం ఇప్పుడు కమలం పార్టీలో ఉంది. కేంద్రమంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింథియా… మధ్యప్రదేశ్లో బీజేపీని గెలిపించే బాధ్యత కూడా తీసుకున్నారు. ఛంబల్, మహాకౌశల్ లాంటి బాగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీజేపీ ప్రయత్నించినందున ఆ పార్టీకి జనాదరణ బాగానే ఉంది.
అమిత్ షా స్పెషల్ ఫోకస్..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రెండు నెలల్లో అమిత్ షా ఐదు సార్లు మధ్యప్రదేశ్ పర్యటనకు వచ్చారు. మండ్ల జిల్లాలో మంగళవారం మూడో జన ఆశీర్వాద్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని నాలుగు మూలల నుంచి యాత్రలు ప్రారంభమయ్యాయి.ఈ సారి ఎన్నికల్లో కనిష్టంగా 150 స్థానాల్లో (మొత్తం 230) గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత 16 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ ను అత్యంత శక్తిమంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి శివరాజ్ సేవలను ఆయన ప్రశంసించారు.