కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి ఏదోక వివాదం రేగుతూనే ఉంది. ప్రభుత్వ పెద్దల అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అడ్డదారులు తొక్కడం లాంటి వార్తలతో పత్రికల పేజీలు నిండిపోతున్నాయి. న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియాకు వార్తలు అవుతున్నాయి. ఐనా సరే సిద్దరామయ్య ప్రభుత్వ తీరు మారడం లేదు. అవినీతి ఆగడం లేదు.
రూ. 9 కోట్లతో 33 లగ్జరీ కార్లు
కర్ణాటక ప్రభుత్వం తాజాగా ముఖ్యమంత్రి, మంత్రుల అధికారిక పర్యటనల కోసం లగ్జరీ కార్లు కొనుగోలు చేసింది. రూ.9 కోట్ల వ్యయంతో 33 లగ్జరీ కార్లను కొన్నది. ఇవన్నీ ఎస్‌యూవీలే కావడం మరో విశేషం. నిజానికి సిద్దరామయ్య సహా మంత్రులందరూ తమ ఆస్తులను ప్రకటించారు. అందరికీ కోటి రూపాయల కంటే ఎక్కువే ఆస్తి ఉంది. అందులో ఒక్క మంత్రి తన ఆస్తులను రూ.1,400 కోట్లుగా ప్రకటించి అత్యంత సంపన్న నాయకుడగా పేరు పొందారు. తామే స్వయంగా లగ్జరీ కార్లు కొనుక్కునే స్ధితిలో ఉన్న మంత్రులకు ప్రభుత్వం కొని ఇవ్వడమేంటన్నది పెద్ద ప్రశ్న
85 శాతం ప్రాంతాల్లో కరువు..
కన్నడ రాజ్యంలో కరువు విలయతాండవం అడుతున్న తరుణంలోనే మంత్రులకు ఖరీదైన కార్లు కొన్నారు. 85 శాతం తాలూకాల్లో కరువు పరిస్థితులున్నాయి. వందల గ్రామాల్లో తాగునీటి వసతి లేదు. దీనితో గ్రామాలు, చిన్న పట్టణాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతోంది. ఒక్కో ట్యాంకర్ రోజుకు 17 ట్రిప్పులు వేస్తోందంటే నీటి ఎద్దడి ఎంతగా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు.ప్రభుత్వ ట్యాంకర్లు చాలక ప్రైవేటు ట్యాంకర్లను కూడా వాడుతున్నారు. నీరు తోడి బోర్లు ఎండిపోతున్నాయి. కరువు సహాయ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాల్సిన తరుణంలో లగ్జరీ కార్లను కొంటున్నారని జనం ఆగ్రహం చెందుతున్నారు.
బిల్లులు చెల్లించకుండానే ఖర్చులు
కార్లు కొనుక్కోవడం సరే.. కమిషన్ల మాటేమిటని కర్ణాటక విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.పేదలకు పట్టెడన్నం పెట్టే ఇందిరా క్యాంటిన్ కార్యక్రమంలో కమిషన్ల కక్కుర్తి కనిపిస్తోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే కమిషన్లు ఇవ్వాల్సిందేనని తేలిపోయింది. హవేరి, హీరేకేరూరు, రణేబేనూరు ప్రాంతాల్లో రూ. 35 లక్షల బిల్లులు బకాయి ఉండగా, వాటిని చెల్లించేందుకు కమిషన్లు అడిగారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. క్యాంటిన్ ఓనర్లను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. యాద్గీర్ జిల్లాలోని షాహాపూర్ లో ఉన్న నిర్మలాదేవీ మహిళా మండలి తరపున మూడు క్యాంటిన్లు నిర్వహిస్తున్నారు. కమిషన్లు ఇవ్వనిదే పనులు జరగడం లేదని ఇటీవలే దాని నిర్వాహకుడు దర్శన్ పుర విశ్వనాథ్ రెడ్డి ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి కార్యాలయంపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బిల్లులు చెల్లించేందుకు సీఎంఓ అధికారులు నేరుగా బేరం పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించి సంచలనం సృష్టించారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా మంత్రులకు లగ్జరీ కార్లు కొంటోంది..