ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న శ్రీకృష్ణుడు, ఎందుకో తెలుసా!

శ్రీకృష్ణుడి భార్యలు అనగానే రుక్మిణి, సత్యభామ గుర్తొస్తారు. అయితే మత గ్రంథాల ప్రకారం శ్రీ కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, సుదంత, భద్ర, లక్ష్మణ. వీరిలో ఎవర్ని ఏం సందర్భంలో పెళ్లిచేసుకున్నాడో తెలుసా.

జాంబవతి
జాంబవతి -సత్యభామను వరుసగా పెళ్లిచేసుకున్నాడు శ్రీ కృష్ణుడు. వినాయక చవితి సందర్భంగా ఈ కథ మీరు వినే ఉంటారు. సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి రోజుకు వేయి బారువుల బంగారాన్నిచ్చే శమంతకమణిని వరంగా పొందాడు. శమంతకమణిని ఒకసారి తనకు ఇవ్వమని కృష్ణుడు అడుగితే ఇవ్వనని చెబుతాడు. ఆ తర్వాత సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళతాడు. అడవిలో వేటకు వెళ్లిన ప్రసేనుడిని ఓ సింహం దాడి చేసి హతమార్చుతుంది. అదే సమయంలో జాంబవంతుడు సింహాంతో పోరాడి శమంతకమణిని తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు. కృష్ణుడే తన సోదరుడిని సంహరించి ఆ మణిని తీసుకుపోయాడని సత్రాజిత్తు ఆరోపిస్తాడు. తనపై వచ్చిన నిందను తొలగించుకోడానికి కృష్ణుడు ఆ మణిని వెదుకుతూ అడవికి వెళ్లి జాంబవంతుడితో 28 రోజులు భీకర యుద్ధం చేస్తాడు. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీమన్నారాయణుడిగా గుర్తించిన జాంబవంతుడు మణితోపాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు.

సత్యభామ
శమంతకమణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకు అప్పగించడంతో ఆయన తన తప్పును తెలుసుకుని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య. ఈమె గొప్ప విష్ణు భక్తురాలు. అమె అందానికి మోహితుడైన మైరావణుడు తన స్థావరంలో బంధిస్తాడు. త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీహరి మహిరావణుడి రాజ్యంలో బంధీగా ఉన్న ఆమెను విడిపిస్తాడు. పెళ్లిచేసుకోమని కోరిన చంద్రకాంతకు వచ్చే జన్మలో పెళ్లిచేసుకుంటానని మాట ఇస్తాడు. ఆమె ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది. పురాణాల ప్రకారం సత్యభామను భూదేవి అంశంగా చెబుతారు. నరకాసుర సంహారంలోనూ సత్యభామ పాత్ర కీలకం.

రుక్మిణి
విదర్భ రాజు భీష్మకుని కుమార్తె రుక్మిణి. కృష్ణుడు తన భర్తగా రావాలని చిన్నప్పటి నుంచీ కోరుకుంది. ఈ విషయం ఆమె సోదరుడు రుక్మికి అస్సలు ఇష్టం లేదు. రుక్మిణిని తన స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు. శిశుపాలుడు, జరాసంధుడికి శ్రీకృష్ణుడు ఆగర్భ శత్రువు కావడంతో రుక్మిణి ఇష్టాన్ని వ్యతిరేకించాడు సోదరుడు రుక్మి. తన బలవంతంగా వివాహం చేస్తున్నాడంటూ రుక్మిణి సందేశం పంపడంతో శ్రీకృష్ణుడు వెళ్లి ఆమెను తీసుకొచ్చి పెళ్లిచేసుకుంటాడు. రుక్మిణి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ అవతారం.

మిత్రవింద
కృష్ణుడికి ఐదుగురు మేనత్తలు. వాళ్ళపేర్లు పృథ (కుంతి), శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాథిదేవి. పృథని శూరసేనుని బంధువు కుంతిభోజుడు దత్తత చేసుకోవడం వలన కుంతి అంటారు. వీరిలో రాజాథిదేవి అవంతీదేశపు రాజు జయశేనుడి భార్య. ఈవిడ కొడుకులు విందానువిందులు, కూతురు మిత్రవింద. విందానువిందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడతారు. చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్ళిచేసుకుంటుంది.

భద్ర
మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె భద్ర. శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలో మిత్రవింద, భద్ర శ్రీ కృష్ణుడికి మేనత్త పిల్లలు.

సుదంత
అసలు పేరు సుదంత. కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె. రాజ్యంలో ఏడు ఎద్దులు అల్లకల్లోలం సృష్టిస్తాయి. వీటిని ఎవ్వరూ బంధించలేకపోతారు. వీటిని అదుపుచేసిన వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు నగ్నజిత్తు. ఆ ప్రకటన తర్వాత కృష్ణుడు ఆ ఎద్దులను వధించడంతో సుదంతను ఇచ్చి వివాహం చేశాడు నగ్నజిత్తు.

కాళింది
కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెళితే కామవాంఛతో కృష్ణుడిని చూసింది కాళింది. గమనించిన అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆవిడ మనోగతాన్ని కృష్ణుడికి చెప్పి పెళ్లిచేసుకునేలా చేశాడు.

లక్షణ
మద్రదేశ రాకుమారి ,బ్రుహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ. నారదుడి ద్వారా శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్థ్యం గురించి విని తననే పెళ్లిచేసుకుంటాని పట్టుబట్టింది. ఈ సందర్భంగా తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో కృష్ణుడిని మనువాడింది.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.