జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వారాహి యాత్ర విశాఖ టౌన్ లో ముగిసింది. దాదాపుగా పది రోజుల పాటు యాత్ర చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ తర్వాత ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. వారాహియాత్ర జోరుగా సాగించడానికి కారణం ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశమే. కానీ ఏపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే ఆలోచన చేయకపోవడంతో… పవన్ ఇప్పుడు పూర్తి చేయాల్సిన సినిమాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన సినిమాలు చాలా వరకూ పెండింగ్ లో ఉన్నాయి. వాటికి డేట్లు సర్దుబాటు చేస్తున్నారు.
వరుసగా మూడు నెలల పాటు సగం రోజులు షూటింగ్‌లకే
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుసగా సగం రోజుల పాటు షూటింగ్‌లకే సమయం కేటాయించాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు షూటింగ్‌లో ఉన్నాయి. ఉస్తాద్ కి… ఓజీకి పెద్ద ఎత్తున కాల్ షీట్లు కేటాయించాల్సి ఉంది. ఆ సినిమాల కనీస షూటింగ్ కూడా ఇంకా చేయలేదు. అందుకే… నెలలో సగం రోజుల పాటు అక్టోబర్ లో ఇరవై రోజుల పాటు కేటాయించాలని నిర్ణయించుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా మూడు నెలల పాటు వారాహియాత్ర జరగకపోవచ్చు.. జరిగినా అతి కొద్ది రోజులు మాత్రమే జరుగుతోంది.
రాజకీయాలపై పవన్ కు ఉండే సీరియస్ నెస్ ఇదేనా ?
పార్టీ నడపడానికే సినిమాలు చేస్తున్నానని పవన్ చెబుతూంటారు. కానీ అసలు పార్టీని పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో కూడా షూటింగ్‌లు చేయడం ఏమిటన్న అసహనం జనసైనికుల్లో కనిపిస్తోంది. పెద్దఎత్తున రాజకీయ వేడి కనిపిస్తున్న సమయంలో షూటింగ్‌లకు వెళ్తే… ప్రజలు కూడా లైట్ తీసుకుంటారని అంటున్నారు. ఓ వైపు అన్ని పార్టీల నేతలు ప్రజల్లోనే ఉంటున్నారు. కానీ పవన్ మాత్రమే పార్ట్ టైమ్ గా వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో అయినా ప్రజల మధ్య ఉండేలా పవన్ ప్లాన్ చేసుకోకపోవడం… ఆయనకు రాజకీయాలపై డైలాగులు తప్ప ఆసక్తి లేదన్న అభిప్రాయం పెరగడానికి కారణం అవుతోందని అంటున్నారు.
జనసైనికులు ఓటేయాలన్నా ఆలోచించే పరిస్థితి
వారాహియాత్రతో పవన్ కల్యాణ్ కాస్త ఊపు తీసుకు వచ్చారు. కానీ ఆయన సభలకు వచ్చిన జనం ఓట్లు వేస్తారా అన్న సందేహాలు ఉన్నాయి. దీనికి కారణం పవన్ వ్యవహారశైలే. ఆయన రాజకీయాల్లో సీరియస్ గా లేకపోవడం… రెండు పడవలపై సమాంతరంగా పయనిస్తూండటం.. కనీసం ఎన్నికల సమయంలోనూ అలాగే ఉండటంతో… పవన్ ఓటు బ్యాంక్ ఆయనను నమ్మలేకపోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి పవన్ ఎప్పుడు తెలుసుకుంటారో ?