టీడీపీలో టిక్కెట్ లేనట్లే – రాయపాటి ఏ పార్టీలోకి ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అసంతృప్త నాయకులు ప్రత్యామ్నయాల వైపు దృష్టి సారిస్తున్నారు. మాజీ ఎంపీ రాయపాటి కుటుంబం నాలుగేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటోంది. 2019లో ఓటమి తర్వాత రాయపాటి సాంబశివరావు కూడా టీడీపీతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సత్తెనపల్లి నుంచి రాయపాటి రంగబాబు పోటీ చేయాలని భావించారు. రంగబాబు 2019లోనే సత్తెనపల్లి సీటు ఆశించిన టీడీపీ పట్టించుకోలేదు. రాయపాటి సాంబశివరావుతో నరసరావుపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేయించారు. అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఎవరికీ సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.

ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రాయపాటి

కాంగ్రెస్ హయాంలో రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కు పోలవరం కాంట్రాక్ట్ దక్కింది. కానీ అప్పులు తీసుకుని సరిగ్గా పనులు చేయకపోవంతో పోలవరం కాంట్రాక్టు నుంచి రాయపాటి కుటుంబానికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థను తప్పించారు. అప్పటి నుంచి టీడీపీ అధినేతతో దూరం పెరిగింది. పోలవరం నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్నా, పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ట్రాన్స్‌ట్రాయ్‌ను తప్పించి నవయుగను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు.ఇది రాయపాటి కినుక వహించడానికి కారణమైంది. ఆయనపై సీబీఐ కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు.

కన్నాను చేర్చుకోవడంతో అసంతృప్తి

ఎన్నికల్లో ఓటమి తర్వాత రాయపాటి తెలుగు దేశం పార్టీకి దూరం అయ్యారు. తాజాగా కన్నాను చేర్చుకోవడంపై అసంతృప్తి రెట్టింపైంది. పార్టీలోకి కొత్త నేతలు రాగానే సీనియర్లను పట్టించుకోలేదని అక్కసు పెరిగింది. కన్నాతో సుదీర్ఘ కాలంగా ఉన్న విబేదాలు, కోర్టువివాదాలను కొద్ది నెలల క్రితమే రాజీ ద్వారా పరిష్కరించుకున్నారు. పరువు నష్టం దావాలతో ఒరిగిదేమి ఉండదని గుర్తించడం, వయో భారం కూడా రాజీకి ఇరుపక్షాలు మొగ్గు చూపాయి. కోర్టు వివాదాలు పరిష్కారమైనా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. అదే సమయంలో బీజేపీ నుంచి కన్నా టీడీపీలో చేరడం, సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించడం రాయపాటి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతోంది.

వైసీపీలో చేర్చుకుంటారా ?

దీంతో ప్రత్యామ్నయం వెదుక్కోవాలని భావించి వైసీపీ వైపు చూస్తున్నారు. అవసరమైతే సత్తెనపల్లిలో కన్నాపై పోటీ చేయడానికి రాయపాటి రంగబాబు సిద్ధమని అంటున్నారు. సత్తెనపల్లి ఇంచార్జిగా తమ కుటుంబాన్ని నియమించాలని రాయపాటి సాంబశివరావు పలుమార్లు కోరినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాలనిభావిస్తున్నట్లు తెలుస్తోంది. రాయపాటిని వైసీపీలోకి తీసుకురావడానికి మాజీ మంత్రి,రాయపాటి శిష్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాయపాటి వెళ్లిపోయినా మంచిదేనని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం.. ఆయన మా పార్టీలో చేరితే ఎలా అని కంగారు పడుతున్నారు ఇప్పుడు పార్టీలో చేర్చుకుని ఏదో ఓ సీటిస్తే పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితేమిటని అంటున్నారు. రాయపాటి దారేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.