ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ప్రజలు ఎన్నుకున్న వారు పాలకులు కాదు. తమ తరపున పాలించమని ప్రతినిధిని ఓటు ద్వారా ఎన్నుకుంటారు ప్రజలు. అంటే ప్రజలే పాలకులు. అదే ప్రజాస్వామ్య మూలసూత్రం. మరి ప్రజలు తమ తరపున పరిపాలించే వారిని ఎన్నుకోవడానికి ఓట్లు వేసేందుకు ఎందుకు బద్దకిస్తున్నారు ? పల్లెల్లో జనం ప్రజాస్వామ్య స్పూర్తిని చూపిస్తూంటే… పట్టణాల్లో జనం ఎందుకు బద్దకిస్తున్నారు ?
90 శాతం ఓటింగ్ నమోదు అయితేనే ప్రజాస్వామ్యానికి రక్ష్
తెలంగాణలో ఎప్పుడైనా 70 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ నమోదవుతుంది. అంటే పాతిక నుంచి ముఫ్ఫై శాతం మంది ఓటర్లు ఓట్లేయడం లేదు. దేశంలో అయితే ఇంకా తక్కువ. గత సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం ఓటింగ్ జరిగింది. అదే సమయంలో పల్లెల్లో కన్నా పట్టణాల్లో పోలింగ్ శాతం అతి తక్కువగా ఉంటోంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రజాభిమానం లేని వాళ్లు విజేతలవుతున్నారు.
ఓటు హక్కే కాదు బాధ్యత కూడా !
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించి హక్కు ఇచ్చేది ఓటు. మన రాష్ట్ర .. దేశ స్థితిగతులనే మార్చే శక్తి ఓటుకు ఉంది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలా మంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. కానీ అది రాజకీయం కాదు. మన బాధ్యత. మన పిల్లలను భవిష్యత్ వేస్తున్న బాట లాంటిది.
సెలవు ఇచ్చినా ఓటు వేయని యువత – సిటీల్లో ఘోరం
పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో రాను రాను పోలింగ్ తగ్గుతోంది. ప్రభుత్వం పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తోంది. ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తాయి. అయినా ఓటు వేయడానికి బద్దకిస్తున్నారు.లాంగ్ హాలీడేస్ వచ్చాయని సొంత పనులు చేసుకుంటున్నారు. ఓటు ప్రాధన్యతను గుర్తించలేకపోతున్నారు. సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే.. ప్రజలు వేయడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామిక ఫలాలు అధికంగా అనుభవిస్తున్న విద్యావంతులు, పట్టణ ప్రాంతాలు, మహానగరాల్లోని సంపన్న వర్గాలు ఓటింగ్ పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూలం ఓటు కాబట్టి అన్ని వైపుల నుంచి ఓటు విషయంలో పవిత్రంగా వ్యవహరిస్తే మన ప్రజాస్వామ్యం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది.