లైగర్ సినిమాతో కెరీర్ లో మరో డిజాస్టర్ వెనకేసుకున్నాడు పూరీ జగన్నాథ్. అయితే ఇలాంటి ఫ్లాప్ లు జగన్ కు కొత్తేం కాదు. ఫ్లాప్ ఇచ్చిన ప్రతీసారి.. పెద్ద హిట్ ఇచ్చి బౌన్స్ బ్యాక్ అవుతాడు. కానీ ఈసారి మాత్రం లైగర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. వెంటనే సినిమా స్టార్ట్ చేయలేదు. ఫలానా వాళ్లతో ఉంటుందని కూడా చెప్పలేదు. కారణం.. లైగర్ సినిమా పూరీ ఇగోని బాగా హర్ట్ చేసింది. దీంతో… ఈసారి తీయబోయే సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. కథని సిద్ధం చేసి… అందుకు తగ్గ హీరోని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు… పూరీ ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ లోనే బిగ్ హిట్ అందుకున్న రామ్. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2.?
రామ్ తో మరో సినిమా ఉంటుందని ఇస్మార్ట్ శంకర్ సినిమా టైమ్ లోనే ప్రకటించాడు పూరీ. అయితే ఆ తర్వాత వరుస సినిమాలతో రామ్, పూరీ జగన్నాథ్ ఇద్దరూ బిజీ అవ్వడంతో.. ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మరోవైపు లైగర్ ఫ్లాప్ తర్వాత జగన్ బాలయ్యతో సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ సడన్ గా రామ్ తో సినిమా తెరపైకి వచ్చింది. బాలయ్య మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అటు రామ్ బోయపాటి తర్వాత వేరే సినిమాకు దేనికీ కమిట్మెంట్ ఇవ్వలేదు. దీంతో… జగన్ పై నమ్మకంతో స్టోరీ చెప్పగానే ఓకే చేసేశాడు రామ్. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెలా, లేదా ఇద్దరూ కలిసి కొత్త కథతో వస్తున్నారా అనే విషయాలు మాత్రం బయటకు రానివ్వడం లేదు. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్. ఈసారి మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు జగన్.
రామ్ తోనే ఎందుకు
ఇండస్ట్రీలో పూరీ అడిగితే చాలామంది హీరోలు కాల్షీట్లు ఇస్తారు. కానీ జగన్ మాత్రం రామ్ వైపే మొగ్గుచూపాడు. కారణం.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. మరోవైపు లైగర్ సినిమాతో తాను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అన్పించుకోవాలని అశ పడ్డాడు పూరీ. కానీ అంచనాల తలకిందులు అయ్యాయి. దీంతో… ఇప్పుడు తీయబోయే సినిమాతో తన ఆశల్ని నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. అందుకే రామ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రామ్ బోయపాటి సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే రామ్ తో మూవీ స్టార్ట్ చేసి… వచ్చే సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు పూరీ. మరి ఈసారైనా పూరీ జగన్నాథ్ కు పాన్ ఇండియా రేంజ్ హిట్ దక్కాలని కోరుకుందాం.