Sri Sri Swatmanandendra Saraswati: భారత యువత పక్కదారి పట్టకుండా హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో లక్ష చండీ మహా యజ్ఞం జరిగిందని, శారదా పీఠం చరిత్రలో ఇది మరువరాని ఘట్టం అని శరదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. హర్యానా కురుక్షేత్ర వేదికగా విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. కురుక్షేత్రలో లక్ష చండీ మహా యజ్ఞం ఘనంగా జరిగిందని అన్నారు. కలియుగంలో ఇలాంటి యజ్ఞం జరగడం అరుదు అని, దేశవ్యాప్తంగా ఉన్న పండితులు యజ్ఞంలో పాల్గొన్నారని తెలిపారు. లక్ష చండి యజ్ఞం.. యజ్ఞ కుంభమేళా లాంటిదని తెలిపారు.
గుంతి ఆశ్రమ ఆధ్వర్యంలో యజ్ఞ నిర్వహణ జరిగిందని, భవిష్యత్ తరాలకు ఇలాంటి యజ్ఞాలు ఎలా చేయాలో డాక్యుమెంట్ రూపొందించాలని శారదా పీఠం భావిస్తుందని శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి చెప్పారు. యజ్ఞ యగాదుల బ్లూ ప్రింట్ రూపొందించాలని శారదా పీఠం భావిస్తుందని అన్నారు. భారత దేశానికి మంచి భవిష్యత్తు కలగాలని, యజ్ఞ ఫలం అందరికి అందాలని కోరుకుంటున్నామని చెప్పారు. కలియుగంలో వినాయకుడు, చండి దేవిని పూజిస్తే కోరికలు తీరుతాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రం కర్మ భూమి, వేద భూమిగా ఎదుగుతున్న సమయంలో ఉత్తర భారత దేశంలో యజ్ఞం నిర్వహించాలని అనేకమంది కోరారని తెలిపారు. విశాఖ శారదా పీఠం యజ్ఞాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తోందని భావించి యజ్ఞం చేయాలని కోరటం జరిగిందని, శారదా పీఠం చరిత్రలో ఇది మరువరాని ఘట్టం అని శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు.
లక్ష చండీ మహా యాగంలో 2022 మంది రిత్వికులు పాల్గొన్నారని, 16రోజులపాటు యజ్ఞం నిర్విఘ్నంగా జరిగిందని తెలిపారు. మహారుద్ర యాగంకూడా ఘనంగా జరిగిందని, ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు ధర్మబద్దంగా, శాస్త్ర బద్దంగా యజ్ఞం జరిగిందని శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. గతంలో ఛత్రపతి శివాజీ నిర్వహించినట్లు నానుడి ఉందని, తరువాత ఇప్పుడే ఈ లక్ష చండి యాగం జరిగిందని స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు.