తెలంగాణలో రాష్ట్రపతి పాలన కోరుకుంటున్న కేటీఆర్ – గెలుపుపై నమ్మకం కోల్పోయారా ?

భారత రాష్ట్ర సమితి వారసుడు కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమవుతాయంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ అలాంటి చాన్సే లేదని కిషన్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఆయన మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ లోనే వస్తాయని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. ఆయన తీరు చూస్తూంటే… ఎన్నికలు ఆలస్యం అవ్వాలని… తెలంగాణలో రాష్ట్రపతిపాలన కావాలని కోరుకుంటున్నట్లుగా ఉందన్న వాదన వినిపిస్తోంది.

జమిలీ ఎన్నికలపై జరుగుతున్నప్రచారాన్ని అనుకూలంగా వాడుకునే యత్నంలో కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావొచ్చని పార్లమెంట్ తో పాటు మే నెలలో జరిగినా ఆశ్చర్యం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. మినీ జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేస్తే.. ఎన్నికలు మేలో జరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీ ప్రస్తుత పదవీ కాలం జనవరి రెండో వారానికి ముగిసిపోతుంది. అసలు ప్రజాప్రతినిధులే ఉండరు కాబట్టి.. ప్రభుత్వం అనే మాటే రాదు. ఆపద్ధర్మ సీఎం అనే మాట వినిపించే అవకాశం లేదు.

అధికారం పొడిగించే అవకాశం లేదు .. రాష్ట్రపతి పాలనే !

రాజ్యాంగ సవరణలో ప్రభుత్వ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ ఏమైనా మార్పులు చేస్తే.. అప్పుడు అవకాశం ఉండొచ్చు. కానీ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వాన్ని కొత్తగా చేసే సవరణ ద్వారా పొడిగించడం ఎలా సాధ్యమన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తే ఎక్కువగా అవకాశం ఉన్న చాయిస్..రాష్ట్రపతి పాలన. ఇది బీజేపీకి కూడా కలిసి వస్తుంది. తెలంగాణ, చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తే కేంద్ర పాలన వచ్చినట్లే. ఎన్నికలకు ఇది అడ్వాంటేజ్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

అధికారం లేని కేసీఆర్ రాజకీయం చేయగలరా ?

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విదిస్తే సీన్ మారిపోతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరు అన్న ఊహను బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేయలేవు. అధికార పగ్గాలు కేసీఆర్ చేతుల్లో లేకుండా ఐదారు నెలలు కేంద్ర పాలన సాగిందంటే ఎన్నో రకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనధికారికంగా బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. ఈ విషయాన్ని కేటీఆర్ అంచనా వేశారో లేదో కానీ… తన దైన మార్క్ అవగాహన లేమి ప్రకటనలు చేస్తున్నారు.