శ్రీకాళహస్తి టీడీపీలో రచ్చ ప్రారంభమయింది. మాజీ మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డి సమకాలికుడు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును కండువా కప్పుతామని పిలిచి టీడీపీ నేతలు అవమానించారు. చివరి క్షణంలో పార్టీలో చేరికను ఆపేశారు. టీడీపీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వ్యతిరేకించడంతోనే ఈ చేరిక ఆగిపోయింది.
సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఇంకా ఏడాది కాలం సమయం ఉందన్న నేపథ్యంలో శ్రీకాళహస్తి రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే టీడీపీలో చేరుతున్నారన్నప్రచారం కావడంతో బొజ్జల వర్గీయులు మండి పడుతున్నారు.
కాళహస్తిలో పోటీ చేస్తానంటున్న నాయుడు
మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే వివిధ పదవుల్లో కొనసాగిన బొజ్జల గోపాకష్ణారెడ్డి తో విభేదించి ఆయన 2004 ఎన్నికల్లో రాత్రికి రాత్రి కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకొని అనూహ్యంగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. తిరిగి తెలుగుదేశంలో చేరారు. అక్కడ నిరాదరణకు గురయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరినా అదే నిరాదరణ కొనసాగింది. అంతేకాకుండా ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆయన దాదాపు నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం రెండుసార్లు ఆశలు పెట్టి మొండి చెయ్యి చూపించింది. అంతేగాకుండా ఆయనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా కొందరు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.
పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ
వైసీపీలో ఆయనకు నిరాదరణ ఎదురు కావడంతో ఆయనను టీడీపీ ఆహ్వానించింది. చేరేందుకు బయలుదేరే సమయంలో… బొజ్జల అడ్డుపడ్డారు. దీంతో ఆయన జనసేన వైపు చూస్తారని అంటున్నారు. తిరుపతి జిల్లాలో తిరుపతికి ఎన్వి ప్రసాద్, శ్రీకాళహస్తికి ఎస్సివీ నాయుడు పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా జనసేన తరఫున పోటీ చేయడానికి ఎస్సీవీ నాయుడు కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆయన అనుచరులు, అభిమానులు రెండు పార్టీల్లోనూ ఉన్నారు. ఈ విషయాలను దష్టిలో పెట్టుకున్న జనసేన అధిష్టానం ఎస్సీవీ నాయుడు వైపు మొగ్గు చూపిస్తోందని చెబుతున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
బీజేపీ తరపున గట్టిగా పోరాడుతున్న కోలా ఆనంద్
బిజెపి తరఫున పోటీ చేయడానికి కోలా ఆనంద్ ఉత్సాహం చూపుతున్నారు. అంతే కాకుండా ప్రచారం చేసుకుంటున్నారు. కోలా ఆనంద్ గ్రామాల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉన్నా లేకపోయినా.. కాళహస్తిలో ఆనంద్ గట్టి అభ్యర్థిగా ఇప్పటికే రాజకీయ పార్టీలు ఫిక్స్ అయ్యాయి.