కాంగ్రెస్ పార్టీకి చైనాకు ఏదైనా విడదీయరాని సంబంధముందా. చైనా ప్రభుత్వం చేస్తున్న భారత వ్యతిరేక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉందా. బీజేపీ నేతృత్వ అధికార ఎన్డీయేపై బురదజల్లేందుకు విదేశీ శక్తులతో చేతులు కలిపారా.. గత 24 గంటల్లో దేశ ప్రజలందరినీ వేధిస్తున్న ప్రశ్నలివే…
కుదిపేసిన న్యూయార్క్ టైమ్స్ కథనం
ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్, చైనా ప్రభుత్వం నుంచి నిధులు అందుకుంటోందని న్యూయార్క్ టైమ్స్ వెబ్ పేజీలో పరిశోధనాత్మక కథనం వెలువడింది. అమెరికా మీడియా మొఘల్ నెవిల్లే రాయ్ సింగం, ఆయన నిర్వహణలో ఉన్న న్యూస్ క్లిక్ చైనా ప్రభుత్వం చేపట్టే భారత వ్యతిరేక ప్రాపగాండాకు సాధనాలుగా మారాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. భారత్ తో సహా పలు దేశాల్లో చైనా అజెండాను ప్రచారం చేసేందుకే ఈ వెబ్ సైట్ పనిచేస్తోందని తేల్సారు. భారత్లో కార్యకలాపాలకు చైనా నుంచి రూ. 48 కోట్ల రూపాయల నిధులు కూడా అందాయని నిర్ధారించారు.
కాంగ్రెస్ పై అనురాగ్ ఠాకూర్ విమర్శనాస్త్రాలు
న్యూస్ క్లిక్ వ్యవహారాన్ని తొలుత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రస్తావించారు. చైనా ప్రభుత్వం చెప్పాలనుకున్న అంశాలు కాంగ్రెస్ నోటి నుంచి వస్తాయని ఆయన అన్నారు. ఎన్డీవోలు, షెల్ కంపెనీలు మాటున కొన్ని పార్టీలు చైనా ప్రభుత్వంతో స్నేహం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అందుకే చైనాను విమర్శించినప్పుడల్లా రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలందరికీ కోపం వస్తుందని అన్నారు. గతంలో ఓ సారి తాను న్యూస్ క్లిక్ వ్యవహారాన్ని ప్రస్తావించినప్పుడు రాహుల్ దాన్ని తేలిగ్గా కొట్టిపారేశారన్నారు. అంతా పొగేనని నిప్పు ఏ మాత్రం లేదని అప్పట్లో అన్న రాహుల్, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కథనం తర్వాత ఏం మాట్లాడతారని అనురాగ్ ఠాకూర్ నిలదీశారు.
పార్లమెంటులోనూ ప్రస్తావన
బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే.. లోక్ సభలో న్యూస్ క్లిక్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. చైనా గొప్పలు చెప్పుకునేందుకు ప్రారంభించిన న్యూస్ క్లిక్ వెబ్ సైట్ ను భారత వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఆయన అన్నారు. దేశ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయాలని నిషికాంత్ దుబే కోరారు. పైగా న్యూస్ క్లిక్ కు సంబంధించిన కొన్ని లింకులను కూడా దుబే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయితే దుబే వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పి కొన్నింటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరింది.