ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన చోట్ల మెరుగైన ఫలితాలు సాధించబోతోందని స్పష్టమయింది. బీజేపీ కోసం విస్తృతంగా ప్రచారం చేసిన విస్తారక్‌లు ఈ మేరకు నివేదికలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అత్యంత హోరాహోరీగా జరిగిన రాజంపేట పార్లమెంట్ పరిధిలో బీజేపీ సంచలన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ సరళి కూడా అదే చెబుతోందని అంటున్నారు.
పీలేరు మెజార్టీ పెట్టని కోట
1957లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, టీడీపీ రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ స్థానాలున్నాయి. పేరుకు ఉమ్మడి కడప జిల్లా పేరుతో ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో పీలేరు కిరమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కంచుకోట. గత రెండు ఎన్నికల్లో వారు ఓడిపోయిన సానుభూతి ఈసారి ఎక్కువగా ఉంది. అక్కడ కనీసం యాభై వేల ఓట్ల మెజార్టీ వస్తుందని అంచనాలు ఉన్నాయి.
మరో నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీకి మెజార్టీ
రాజంపేట లోక్ సభ పరిధిలో ఉన్న రాజంపేట, కోడజూరు, తంబళ్లపల్లి, మదనపల్లెల్లో కూడా బీజేపీ కూటమి అభ్యర్థి అయిన కిరణ్ కుమార్ రెడ్డికి మెజార్టీ వస్తుందని పోలింగ్ సరళి స్పష్టం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి వల్ల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు కూడా లాభపడనున్నారు. ఆయనకు జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉండటం.. టీడీపీ జనసేన వర్గాలు సంపూర్ణంగా సహకరించడంతో ఆ నియోజకవర్గాల్లో ఒక్కో దాట్లో పది నుంచి ఇరవై వేల వరకూ మెజార్టీ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
వైసీపీకి రెండు స్థానాలపైనే ఎక్కువ ఆశలు
పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు స్థానాల్లో రెండుచోట్ల మాత్రమే వైసీపీకి మెజార్టీ ఆశలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుస్తూ వస్తున్న పుంగనూరు కాగా.. మరొకటి రాయచోటి. ఈ సారి రాయచోటిలోనూ కూటమి గట్టి పోటీ ఇచ్చింందన్న ప్రచాచరం జరుగుతోంది. అంటే అక్కడ ఎవరు గెలిచినా తేడా ఐదారు వేల ఓట్ల తేడానే. పుంగనూరులలో గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి 30 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కానీ కిరణ్ కు ఇతర నియోజకవర్గాల్లో వచ్చే మెజారిటీతో పోలిస్తే ఇది తక్కువే. అందుకే కిరణ్ బీజేపీ తరపున పార్లమెంట్ లో అడుగు పెట్టడం ఖాయమనుకుంటున్నారు.