కిరణ్ దౌత్యం – బీజేపీలోకి లగడపాటి – విజయవాడ నుంచి పోటీ ?

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. లగడపాటి రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రెండు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గత కొద్ది కాలం నుంచి మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన అనుచరులు విజయవాడలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కిరణ్ చొరవతో బీజేపీ అగ్రనేతలతో లగడపాటి చర్చలు

మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గడపాటికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో చేరిన అతి కొద్దిరోజుల్లోనే కిరణ్ రెడ్డికి మంచి ప్రాధాన్యత ఇచ్చింది అధిష్టానం. కమలం గూటికి చేరితే బాగుంటుందని కిరణ్ స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆయనకు ఆ పార్టీ నుంచి ఆహ్వానం వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒకటి రెండు సార్లు అగ్రనేతలతో సమావేశం అయినట్లుగా చెబుతున్నారు. పొత్తులు ఇతర పరిణామాలపై కొలిక్కి వచ్చాక ఆయన బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి.

లగడపాటి కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నం

ఏపీలో టీడీపీ, వైసీపీలకు విజయవాడ అభ్యర్థి సమస్య ఉంది. అందుకే రెండు పార్టీలు లగడపాటి కూడా మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. చాలా కాలంగా ఢిల్లీకే పరిమితమైన ఆయన అప్పుడప్పుడూ ఏపీకి వస్తున్నారు. చంద్రబాబుకు లగడపాటికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సార్లు లగడపాటి టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో లేనని లగడపాటి ప్రకటించారు. అనుచరులందరూ కలిసి త్వరలో పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఆత్మీయ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

రాజకీయంగా లగడపాటికి ఓటమి ఎరుగని రికార్డు

కాంగ్రెస్ తరఫున ల‌గ‌డ‌పాటి 2004, 2009 ఎన్నికల్లో విజ‌యవాడ పార్లమెంట్ నుంచి పోటీచేసి గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌పై లక్ష ఓట్ల మెజార్టీతో 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై 12 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. లగడపాటి రాజకీయ రీ లాంచ్ జరిగితే రాజకీయాల్లో మరింత హడావుడి ఉంటుంది.