ఉగ్రవాదాన్ని పెంచి పోషించే అత్యంత దుర్మార్గ దేశంగా పాకిస్థాన్ కు పేరుంది. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ లో అలజడి రేపి, కశ్మీర్ ను హస్తగతం చేసుకోవాలన్న తపన పాక్ పాలకుల్లోనూ, అక్కడి ఐఎస్ఐ పెద్దల్లోనూ నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. ఒక ఉగ్రవాది భారత్లోకి చొరబడి హతుడైన మరో ఇద్దరినీ రిక్రూట్ చేసుకునే తత్వం పాకిస్థాన్ పాలకులది. చంపు, చావు అన్న ఫిలాసఫీతో ఉగ్రవాదులకు మతోన్మాదాన్ని నూరిపోసి సరిహద్దు దాటిస్తోంది. ఉగ్ర మూకలను తయారు చేసే ముఠాలు మాత్రం పాకిస్తాన్లోనూ, ఆక్రమిత కశ్మీర్లోనూ తిష్ట వేసుకు కూర్చుంటున్నాయి. వారికి ఇంతకాలం పొరుగు రాజ్యం ఒక స్వర్గధామంగా కొనసాగింది. అలాంటిది ఇప్పుడెందుకో తేడా కొడుతోంది. పాకిస్థాన్ దేశంలో ఏదో అనుకోనిది జరుగుతోంది…
ఉగ్రనేతల వరుస హత్యలు
రెండేళ్లుగా పాకిస్థాన్లో ఉగ్రనేతలు అనుమానాస్పద హత్యలకు గురవుతున్నారు. లష్కరే తయ్యబా, జైషే మొహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఖలీస్థానీ ఫోర్స్ కు చెందిన ఉగ్రనేతలు, వారి అనుచరులను గుర్తు తెలియని దుండగులు కాల్చిపడేసి పారిపోతున్నారు. ఈ నెలలోనే ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు .వారందరూ లషరే తయ్యబాకు చెందిన మౌలానా మసూద్ అజర్ కు అత్యంత సన్నిహితులుగా పేరుంది. 2021లో లాహోర్ లో హఫీజ్ సయీద్ పై హత్యాయత్నం జరిగినప్పటి నుంచి వరుస దాడులు కొనసాగుతున్నాయి. 2008 ముంబై దాడుల సూత్రధారే హఫీజ్ సయీద్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒకేలా ఉన్న హత్యల తీరు
హత్యలు జరుగుతున్న తీరుపై ఏం పెద్ద తేడా కనిపించడం లేదు. ముసుగులు వేసుకుని మోటార్ బైకులపై వచ్చే వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోవడం, ఉగ్రవాదులు అక్కడికక్కడి చనిపోవడం జరుగుతోంది. భారత్ లో ఉగ్రకార్యకలాపాలు నిర్వహించడం లేదా వాటిని ప్రోత్సహించడం చేసే వారే టార్గెట్ గా మారుతున్నారు. ఈ హత్యలను దర్యాప్తు చేస్తున్న పాకిస్థాన్ అధికారులు… మొత్తం వ్యవహారం వెనుక భారత్ ఉందని అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉండే హంతకులకు భారత ఏజెన్సీలు కాంట్రాక్ట్ కిల్లింగ్ పని అప్పగించారని వారి అనుమానంగా తెలుస్తోంది. దుబాయ్ గుండా ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయని అక్కడ కూర్చున్న ఇండియన్ ఏజెంట్సే పాకిస్థాన్లో హత్యలు చేయిస్తున్నారని అనుమానిస్తున్నారు. బయటకు మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదు..
మౌనం వెనుక రహస్యమేంటో ….
సాధారణంగా ఎలాంటి హత్య జరిగినా భారత్ పై వందల ఆరోపణలు చేసే పాక్ నేతలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇప్పుడు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఇండియాలో మోస్ట్ వాటెండ్ ఉగ్రవాదులుగా పేరు పొంది పాకిస్థాన్ ప్రభుత్వానికి జాబితా సమర్పించిన వారే ఇప్పుడు హత్యకు గురవుతున్నారు. ఇంతకాలం వారంతా తమ దేశంలో లేరని బుకాయిస్తూ వచ్చిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఏమి మాట్లాడినా ఉగ్రవాదులకు తాము ఆశ్రయం ఇచ్చిన సంగతి అంగీకరించినట్లవుతుందని పాక్ ప్రభుత్వం భయపడుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకుంటేనే ఆర్థిక సాయం చేస్తామని అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ కు షరుతులు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఉగ్రమూకలు తమ వద్దే ఉన్నాయని అంగీకరిస్తే సాయం ఆపేస్తాయరన్న భయం పాక్ పాలకుల్లో నెలకొంది.