గుంటూరు, కృష్ణా జిల్లాల టీడీపీలో ముసలం ప్రారంభమయింది. ఎంపీ గల్లా జయదేవ్ కంటికి కనిపించి చాలా కాలం అవుతోంది. మరో వైపు కోడెల శివరాం, కేశినేని నాని ఇబ్బందులు సృష్టిస్తున్నారు. తాము హైకమాండ్ కంటే బలవంతులం అంటున్నారు. కానీ వారిని కంట్రోల్ చేయలేని స్థితిలోకి టీడీపీ అధినేత వెళ్లిపోయారు. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ పరిస్థితి ఏమిటన్న చర్చలు జరుగుతున్నాయి. కేశినేని నాని పార్టీ మారడం ఖాయంగా చెప్పుకుంటున్నారు.
కేశినేని నానిని పొమ్మనలేక పొగపెట్టిన టీడీపీ
ఎంపీగా గెలిచినప్పటి నుండి కేశినేని నాని టీడీపికి దూరంగానే ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తాను ఎంపీగా మాత్రమే కొనసాగుతానని..పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని ప్రకటించారు. తనతో పాటుగా తన కుమార్తె సైతం పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటారని స్పష్టం చేసారు. బెజవాడ నగరంలోని పార్టీ నేతలు..క్రిష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పైన కేశినేని గుర్రుగా ఉన్నారు. వారి కారణంగానే పార్టీ జిల్లాలో నష్టపోయిందనేది కేశినేని వాదన. తాను అధినాయకత్వానికి ఇదే అంశం పైన ఎన్ని సార్లు చెప్పినా..ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం పైన ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని .. పొమ్మనలేక పొగ పెట్టిందని నమ్ముతున్నారు.
ముందు నుంచీ బీజేపీ అగ్రనేతలతో కేశినేని నానికి సన్నిహిత సంబంధాలు
కేంద్ర మంత్రులు గడ్కరీ.. రాజ్ నాధ్ సింగ్ లతో కేశినేని నానికి మంచి సంబంధాలు ఉన్నాయి. వారిని తరచూ కలుస్తూంటారు కూడా. చంద్రబాబు తన మాటలను పట్టించుకోకపోవటంతో ఇక పార్టీలో ఉండి ఉపయోగం లేదనే భావనతో నాని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం అయినట్లు ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల తరువాత టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వేంకటేశ్, సీఎం రమేష్ బీజేపీలో చేరారు. ఇప్పటికే టీడీపీ అధినేతతో పూడ్చలేనంత గ్యాప్ వచ్చినందున వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన బీజేపీ నుంచే పోటీ చేస్తారని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు.
అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉందన్న కేశినేని నాని
కేశినేని నాని వ్యవహారశైలిపై టీడీపీలో పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆయనకు టిక్కెట్ ఇచ్చే ఆలోచన ఉంటే పార్టీ ఖచ్చితంగా గౌరవించేదని చెబుతున్నారు. కేశినేని నాని తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తానని చెబుతూ మరీ ఎక్కువ ఊహించుకుంటున్నారని అది ఆయనకు మంచిది కాదని పార్టీ వర్గాలు నేరుగానే చెబుతున్నాయి. అయితే టీడీపీ లో తనకు జరిగిన అవమానానికి గట్టి షాక్ ఇవ్వాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఇతర పార్టీల నంచి ఆహ్వానాలు ఉన్నాయని చెబుతున్నారు.