నందిని పాలకు కేరళ బ్రేక్ – ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందని కాంగ్రెస్‌కు అర్థమయిందా ?

సెంటిమెంట్ రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు. కర్ణాటక ఎన్నికల్లో అమూల్ ను బూచిగా చూపి వారు చేసిన రాజకీయం ఇంకా కళ్ల ముందే ఉంది. నందిని బ్రాండ్ పాలకు ఏదో చేస్తున్నారని.. అంతా అమూల్ కు కట్టబెట్టేస్తున్నారని ఆరోపణలు చేశారు. కానీ నిజాలు మాత్రం ఎవరికీ చెప్పలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు వారికి తాము చేసిన తప్పేమిటో తెలుస్తోంది. ఇప్పుడు వారి నందిని బ్రాండ్ కు వారే ఎంత నష్టం చేసుకున్నారో క్లారిటీ వస్తోంది. వారి పాలకు కేరళ ప్రభుత్వం బ్రేక్ వేసింది.

నందిని పాలపై కేరళ నిషేధం

కర్నాటకకు చెందిన ప్రభుత్వ రంగంలోని సహకార సంఘం పాల బ్రాండ్‌ నందిని కేరళలోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. నందిని కేరళలో అవుట్‌లెట్స్‌ను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నందిని ప్రయత్నాలకు అడ్డుకోవాలని కేరళ ప్రభుత్వం నేషనల్‌ డైయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డును కోరింది. నేషనల్‌ డైయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు జోక్యం చేసుకున్నందున కేరళలో కార్యకలాపాలు ప్రారంభించాలన్న ప్రయత్నాలను విరమించుకున్నట్లు నందిని సీఈఓ ప్రకటించారు.

అమూల్ ను ఎలా ఆపారో నందిని అలా ఆపేశారు !

కేరళ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ మిల్మా బ్రాండ్‌ పేరుతో పాలను విక్రయిస్తోంది. కర్నాటక కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నందిని బ్రాండ్‌తో పాలను విక్రయిస్తోంది. మిల్మా, నందిని రెండు సహకార సంఘం నిబంధనల కిందనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అందువల్ల తమ ప్రాంతంలోకి నందిని అనుమతించలేమని కర్నాటక కు స్పష్టం చేసింది. కర్నాటకలో గుజరాత్‌ సహకార సంఘానికి చెందిన అముల్‌ రాకను కర్నాటక వ్యతిరేకించినట్లుగానే తాము కూడా నందినిని వ్యతిరేకిస్తున్నామని కేరళ మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కర్నాటకు చెందిన నందిని అవుట్‌లెట్స్‌ను కేరళలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించారని, ఇది ఎంత మాత్రం సరైంది కాదని మంత్రి చెప్పారు. ఇది అనైతిక చర్యని విమర్శంచారు.

ఇప్పుడు ఎవరికి నష్టం ?

అమూల్ పేరుతో రాజకీయం చేసి కాంగ్రెస్ రాజకీయలబ్ది పొందింది. కానీ నష్టపోయిన వారు ఎవరు .. రైతులే. కర్ణాటక పాడి రైతులే తీవ్రంగా నష్టపోతున్నారు. వారి ఉత్పత్తులకు ఎంత డిమాండ్ పెరిగితే అంత లాభం వస్తుంది. కానీ ఈ లాభాన్ని రాకుండా కాంగ్రెస్ చేసినట్లయింది. కుత్సిత రాజకీయాలు చేస్తే అంతిమంగా ఆ పార్టీలకు రాజకీయ లబ్ది కలగవచ్చు కానీ ప్రజలు నష్టపోతారు. ఇలాంటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరితేరిపోయినట్లుగా కనిపిస్తోంది.