కీర దోసకాయ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సమ్మర్లో తింటే చాలా మంచిది. కానీ దీనిని వర్షాకాలం, చలికాలంలో తినొచ్చా? ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో చూద్దాం
జీర్ణక్రియను మెరుగుపర్చే కీరదోస
కీర దోసకాయను చాలామంది ఇష్టంగా తింటారు. 96 శాతం నీటితో నిండి ఉండే కీరదోస జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. చర్మంపై నల్లటి వలయాలు పోగొట్టేందుకు పని చేస్తుంది. ముఖ్యంగా సమ్మర్లో తింటే వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో ఎక్కువగా తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా కాపాడుతుంది. సలాడ్, శాండ్ విచ్, సైడ్ డిష్ లో భాగంగా భోజనంతో పాటు తీసుకుంటారు.
అన్ని సీజన్లలో తినొచ్చా!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే కీర దోసకాయను అన్ని రకాల వాతావరణంలో తినొచ్చని అనుకుంటారు కానీ వానాకాలం, శీతాకాలంలో రెగ్యులర్ గా తినకపోవడమే మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. వాతావరణం మారిన తర్వాత ఎక్కువ మంది జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడతారు. ఎందుకంటే ఇందులో సహజ ఆస్ట్రిజెంట్ లక్షణాలకి కలిగి ఉంటాయి. ఇది శరీరం వెచ్చగా ఉండకుండా మరింత చల్లదనం ఇస్తుంది. వాతావరణం చల్లగా ఉండే రోజుల్లో కీరదోస తిన్నా, ఆ రసం తాగినా కఫం పెరుగుతుంది. అలవాటైపోయింది తప్పనిసరిగా తీసుకుంటాం అనుకుంటే మాత్రం పగటి పూట మాత్రమే తీసుకోండి..ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి పూట కీరదోస తినకపోవడమే మంచిది.
చేదుగా ఉంటే కక్కుర్తిపడొద్దు
కొనుగోలు చేసిన కీరదోసకాయలు ఒక్కోసారి చేదుగా ఉంటాయి. పడేయడం ఎందుకులే అని లాగించేసేవారూ ఉన్నారు. అవి తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు . చేదుగా ఉండే కీరదోసలో హానికర రసాయనాలు పొట్టలో చెరి విషపూరితం కావొచ్చు. ఒక్కోసారి ప్రాణాంతకమైన అలర్జీలకి కారణం అవుతుంది. కీరదోస అధికంగా తిన్నవారిలో పొటాషియం అధికంగా చేరి హైపర్ కలేమియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొట్ట ఉబ్బరం, తిమ్మిరి, గ్యాస్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తినడం కూడా ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.