ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. రూ. ఆరు వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. బహిరంగసభ నిర్వహిస్తున్నారు. అది అధికారిక కార్యక్రమం. బీజేపీ సభ కాదు. వరంగల్‌లో నిర్వహించనున్న మోదీ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం పంపింది. మరి ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా అనే దానిపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ నడుస్తోంది.
మోదీకి ఎదురుపడేందుకు ధైర్యం చేయని కేసీఆర్
ప్రధాని ఎప్పుడు వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ ఆహ్వానం పలకడం లేదు. ఢిల్లీలో సమావేశం అయ్యేందుకు కూడా ప్రయత్నించడం లేదు. అయితే అప్పట్లో కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించి ఉన్నారు. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లిన అక్కడి సీఎంలు పాల్గొంటారు. బీజేపీ విధానాలపై ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా.. మోదీ పై విమర్శలు చేసినా సరే .. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ వంటి వారు ప్రధాని వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలుకుతారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఇష్టపడలేదు. గతంలో చినజీయర్ ఆశ్రమంలో సమతా విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చినప్పుడు కానీ.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి వచ్చినప్పుడు కానీ ఆయన స్వాగతం చెప్పలేదు. సీనియర్ మంత్రి తలసానికి ఆ బాధ్యతలిచ్చారు.
హాజరయ్యేది లేదని ఇప్పటి వరకూ ప్రకటించని కేసీఆర్
కేసీఆర్ ప్రధానిని గౌరవించకపోవడంపై తీవ్ర దుమారం రేగింది. సీఎంను ఆహ్వానించలేదని ఓ సారి బీఆర్ఎస్ మంత్రులు విమర్శించారు..కానీ ఆహ్వానం పంపామని కేంద్ర మంత్రులు ఖండించారు. తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది కానీ..ప్రధాని మోదీ పర్యటన ఎప్పుడు ఉన్నా .. తెరపైకి వస్తూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. బీజేపీపై కేసీఆర్ యుద్ధం దాదాపుగా ఆపేశారు. విమర్శలు కూడా చేయడం లేదు. తప్పని సరి సందర్భం వస్తే .. కాంగ్రెస్, బీజేపీ రెండింటిని విమర్శిస్తున్నారు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి వచ్చారు. కేంద్రం సాయం చేయాలని కోరారు. ఇప్పుడు ప్రధాని తెలంగాణకు వస్తే ఎందుకు స్వాగతం చెప్పరనే విమర్శలు వస్తాయి.
కేసీఆర్ హాజరైతే
ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే ఆయనకు కేసీఆర్ స్వాగతం చెప్పే అవకాశం ఉందన్నది ఎక్కువ మంది అంచనా వేస్తున్న విషయం. ఇది రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది. గతంలో కేసీఆర్ ఆహ్వానించలేదు..ఇప్పుడెందుకు ఆహ్వానించారని ప్రశ్నించేవారు ఉంటారు. గతంలో ప్రోటోకాల్ పాటించినట్లయితే ఇప్పుడు ఆహ్వానించినా సమస్య ఉండేది కాదు. మొత్తంగా మోదీ తెలంగాణ పర్యటనలో రాజకీయంగా కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ బీజేపీని చూసి భయపడుతున్నారని .. అందుకే మారిపోయారన్న వాదన వినిపిస్తోంది.