ప్రజాధనంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలా? సోమేష్ సలహాదారు పదవి వెనుక భారీ స్కెచ్ ! ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్ముతో రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన శరద్ మర్కడ్ అనే యువకుడికి ఏటా పద్దెనిమిది లక్షల జీతంతో పర్సనల్ సెక్రటరీగా నియమించారు. ఆయనతో మహారాష్ట్ర నుంచి మనుషుల్ని తెప్పించుకుని కండువాలు కప్పుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.తాజాగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు కూడా పార్టీ పనుల కోసమే ముఖ్య సలహాదారు పదవి ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి.

బీఆర్ఎస్ కోసమే సోమేష్ పని చేస్తారా ?

మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారు పదవి ఇచ్చారు.ఇప్పటికే రాజీవ్ శర్మ అనే మరో మాజీ సీఎస్ కూడా ముఖ్యసలహాదారు పదవిలో ఉన్నారు. అయితే రాజీవ్ శర్మ పూర్తిగా పాలనా పరమైన వ్యవహారాలను.. సోమేష్ కుమార్ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఉత్తరాది వ్యవహారాలను చూస్తారన్న ప్రచారం జరుగుతోంది. సోమేష్ కుమార్ కు రాజకీయాలపై చాలా ఆసక్తి ఉంది. ఆయన సర్వేలు కూడా చేయించి కేసీఆర్ కు ఇస్తూంటారు. ప్రశాంత్ కిషోర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

బీహార్ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ తరపున సోమేష్ వెళ్తారా ?

సోమేష్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీని ఉత్తరాదిలో విస్తరించడానికి అమలు చేయాల్సిన ప్రణాళికల్లో కీలకంగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అసలు సలహాదారు పదవి ఇవ్వాలా లేకపోతే బీహార్ బీఆర్ఎస్ యూనిట్ ఇంచార్జ్ గా పెట్టాలా అనే చర్చ కూడా బీఆర్ఎస్‌లో సాగిందని చెబుతున్నారు. చివరికి సలహాదారు పదవికే సెటిల్ అయ్యారు. ఇటీవల మహారాష్ట్రలో చేరికలు.. సభల విషయంలో సోమేష్ కుమార్ జోక్యం పరోక్షంగా ఉందంటున్నారు. మూడో బహిరంగసభలో ఆయన కూడా కనిపించారు.

ప్రభుత్వంలో ఇచ్చే సలహాలేం లేవు.. రాజకీయమే !

బీహార్ కు చెందిన సోమేష్ హిందీ రాష్ట్రాల బీఆర్ఎస్ బాధ్యతల్ని చూస్తారని .. కేసీఆర్ ప్రణాళికల్ని అమలు చేస్తారని అంటున్నారు. కేబినెట్ హోదా కూడా కల్పించడంతో ఆయనకు మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లయిది. కేసీఆర్ హిందీ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఉనికి కోసం ఇప్పటి వరకూ చేసిందేమీ లేదు. కానీ అంతర్గతంగా ప్రణాళికలు వేస్తున్నరు. సోమేష్ వాటిని కంటిన్యూ చేసి.. నేరుగా రంగంలోకి దిగాలనుకున్నప్పుడు.. క్షేత్ర స్థాయిలో పని చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ప్రజాధనం యాభై లక్షలు ఎడాదికి సోమేష్ కు ఇచ్చి పార్టీ పని చేయించుకుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.