ఖాళీ ఖజానాతో కేసీఆర్ విన్యాసాలు – కేంద్రంపై నిందలేసి తప్పించుకునే ప్లానేనా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ అందరికీ తెలిసిపోయేలా డబుల్ గేమ్ ఆడుతున్నారు. రుణమాఫీ ఎందుకు చేయలేదంటే.. కేంద్రం సహకిరంచలేదని.. చెప్పుకొచ్చి..ఇప్పుడు రూ. 19వేల కోట్లను ఒక్క నెలలో ఇచ్చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు కేంద్రం సహకరించిందా అంటే.. బీఆర్ఎస్ నేతల వద్ద సౌండ్ లేదు. కానీ చిత్ర విచిత్ర విన్యాసాలు వేస్తూ.. ప్రజల్ని మభ్యపెట్టి..బీజేపీని దోషిగా చూపించి .. తాను మాత్రం గొప్పగా ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అనేక హామీల్ని ఎగ్గొట్టిన కేసీఆర్

2018 ముందస్తు ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. ఒకే విడతలో రుణమాఫీ , నిరుద్యోగ భృతి, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇలాలెక్కలేనన్ని హామీలు ఇచ్చారు.కానీ ఒక్క దాన్నీ అమలు చేయలేదు. రైతులకిచ్చిన రుణమాపీ హామీ నాలుగున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఎన్నికల ఏడాదిలో పూర్తి చేయాడనికి బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించారు. 2018 ఎన్నికల్లోనూ పంట రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు రూ.37 వేల లోపు రుణాలను మాఫీచేసింది. మొత్తం 5.42 లక్షల మందికి చెందిన రూ.1,207 కోట్ల రుణాలను మాఫీ చేసింది. మిగిలిన 37 వేల నుంచి 90 వేల లోపు గల రుణాలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాఫీ చేయాల్సి ఉంది. ఇందు కోసం 19 వేల కోట్లు అవసరం. కానీ బడ్జెట్‌లో కేటాయించింది ఆరు వేల కోట్లు మాత్రమే. అయినా నెలన్నరలో పూర్తి చేస్తామని ప్రకటించారు.

ప్రజల్ని మాయ చేసే ప్రయత్నంలో కేసీఆర్ బిజీ

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజులుగా ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. తన పార్టీకి ఎక్కడెక్కడ మైనస్ ఉందో సర్వేల మీద సర్వేలు చేయించుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు . ఇంత కాలం రుణమాఫీ చేయకపోవడానికి కేంద్రం కారణం అని ప్రకటించారు కేసీఆర్. అప్పులు తీసుకోకుండా అడ్డుకోవడమే కారణం అన్నారు. మరి ఇప్పుడు కేంద్రం అనుమతించిందా అన్నదే ప్రశ్న. నిధుల సమీకరణ ఎలా అన్నది మిస్టరీగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున పథకాలకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మినహా జిల్లాల్లో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. మరి వేల కోట్లు ఎలా సమీకరిస్తారన్నది కీలకంగా మారింది. ఎన్నికల్లో ఓటింగ్ జరిగే నాటికి హామీలన్నీ పూర్తి కాకపోతే.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది.

మద్యం విధానాన్ని ముందుకు జరిపి నిధులు సేకరించే ప్రయత్నం

తెలంగాణమద్యం పాలసీ డిసెంబర్ వరకూ ఉంది. అయినా ఆగస్టులోనే షాపుల వేలం వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్‌లో చేయాల్సిన పనిని ఆగస్టులోనే చేసేస్తున్నారు. దీని ద్వారా కనీసం రెండు వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సొమ్ముతో అరకొరగా పథకాలకు పంచి.. ఈ లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తే.. మళ్లీఈసీ అడ్డుకుందనే ప్రచారంతో ప్రజల ముందుకు వెళ్లి మాయ చేసే ప్లాన్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.