తెలంగాణ మెడికల్ కాలేజీల్లో విభజన చట్టం ప్రకారం ఉన్న ఓపెన్ కొటాను తెలంగాణ ప్రభుత్వం తొలగించడంపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ వైద్య విద్యార్థులకు నష్టం కలిగేలా తెలంగాణ ప్రభుత్వం జిఓ నంబర్ 72 తీసుకువచ్చిందని.. విభజన చట్టంప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. అందరికీ విద్య, వైద్య అంశాలలో సమాన హక్కులున్నాయన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు.
చీకటి జీవో రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్
2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆర్టికల్ 371 డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేసినట్టు పేర్కొన్నది. గతంలో కన్వీనర్ కోటాలో స్థానిక విద్యార్థులకు 85 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండేది. మిగతా 15 శాతం అన్ రిజర్వుడ్ క్యాటగిరీ. ఇందులో తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ఈ నిర్ణయంతో 520 మెడికల్ సీట్లు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల వారు పోటీ పడే అవకాశాన్ని కోల్పోయారు.
జాతీయ పార్టీగా మారి సంకుచిత బుద్దా ?
బిఆర్ ఎస్ గా మారామంటున్నారు… మహారాష్డ్రలో కొన్ని వార్డులలో నెగ్గామంటున్నారు …ఇలాంటి జీవోలకు మహారాష్ట్ర, ఆంధ్రాకి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఆంధ్రాకి అన్యాయం చేసిన బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రకి అన్యాయం చేయదా … ఈ అంశంపై ఏపీ సీఎం వైద్య శాఖ మంత్రి తక్షణమే స్పందించాలన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని.. వారు పోరాడుతూంటే కనీసం పట్టించుకోవడం లేదన్నారు. సర్పంచ్ ఎన్నికలలో 90 శాతం గెలిచామన్నారు…ఇపుడా సర్పంచ్ లు రోడ్డెక్కారని .. ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచ్ లకి ఎందుకు కనీస గౌరవం ఇవ్వటం లేదో సమాధానం చెప్పాలన్నారు. చట్టాలు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే సర్పంచ్ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదన్న విష్ణువర్ధన్ రెడ్డి
ఈ జీవో జారీ చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం కోర్టుకి వెళ్లాల్సి ఉన్నా.. పట్టించుకోకపోవడంతో విద్యార్థులు వెళ్లారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ సెక్రటేరియట్ ని తెలంగాణాకి పూర్తిగా అప్పగించారని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు.. ఇలాంచి కురచ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారని.. విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. జాతీయ పార్టీగా మారిన కెసిఆర్ సంకుచిత బుద్దితో ఎపి విద్యార్ధులకి అన్యాయం జరిగేలా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు.