ప్రజాస్వామ్యంలో ఎవరు అయినా ప్రధాని పదవి చేపట్ట వచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ ప్రధాని పదవి ఎలా వస్తుంది అంటే.. పూర్తిగా ప్రజలు ఇస్తేనే వస్తుంది. అదే ప్రజాస్వామ్యం. ప్రజలు ఎవరు ప్రధానిగా కోరుకుంటారో వారికే మద్దతు లభిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్న ఏకైక చాయిస్. అందులో డౌటే లేదు. చాలా మంది ప్రాంతీయపార్టీల నేతలు సీనియర్ నేతలు… తాము ప్రధాని కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో ఉన్న వారు. .. లేని వారు ఈ జాబితాలో ఉంటున్నారు. అయితే కొత్తగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సీఎంలు కూడా తాము ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ప్రధాని అయిపోయినట్లుగానే వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ !
తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ప్రధాని అపోయినట్లుగానే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తాను ఢిల్లీ పీఠం మీద ఉంటానని.. అందరికీ దళిత బంధు , రైతు బంధు పథకాలతో డబ్బులు లక్షలకు లక్షలు ఖాతాలకు జమ చేస్తానని చెబుతున్నారు. ఆయన చెబుతున్న మాటలు ఇతర రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయో లేదో కానీ.. తెలంగాణలో మాత్రం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న పార్లమెంట్ సీట్లు 17 మాత్రమే. అందులో హైదరాబాద్ స్థానంలో పోటీ చేయరు.. చేసినా డిపాజిట్ రాదు. మిగిలి పదహారు స్థానాల్లో పట్టుమని పది కూడా వస్తాయని ఎవరూ గట్టిగా చెప్పలేకపోతున్నారు. పట్టుమని పది మంది ఎంపీలూ ఉండని పార్టీ నుంచి ప్రధాని ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. అయితే తమది జాతీయ పార్టీ అని దేశమంతా పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ పక్కనే జరుగుతున్న కర్ణాటక ఎన్నికల వైపు చూడటానికే భయపడే పార్టీ…. దేశం మొత్తం ఎలా పోటీ చేస్తుంది.
కొత్తగా జగన్ కి కూడా ప్రధాని పీఠంపై ఆశలు !
17 సీట్లు ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ప్రధాని అవ్వాలని తహతహలాడుతూంటే.. పాతిక పార్లమెంట్ సీట్లు ఉన్న ఏపీకి సీఎం అయిన తాను మాత్రం ఎందుకు సైలెంట్ ఉండాలని జగన్ అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆయనకూ ప్రధాని పదవి ఆశ ఉందని తాజాగా ఓ ఉదంతం ద్వారా తేలిపోయింది. కాబోయే ప్రధాని జగన్ అని టీ షర్టు మీద సైకిల్ యాత్ర చేసుకుంటూ మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే అనే వ్యక్తి అమరావతి వచ్చారని వైసీపీ నేతలు ప్రకటించారు. ఆయన సీఎం జగన్ ప్రధాని కావాలనే స్లోగన్‌తో టీ షర్టు వేసుకున్నాడు. ఆయనను జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించి ఫోటోలు దిగారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆ విషయాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో ప్రధాని పదవిపై జగన్ ఆశపడ్డారని.. చాలా మందికి క్లారిటీ వస్తోంది. తనకు ఏం తక్కువ అని జగన్ అనుకోవడంతో ప్రధాని రేసులోకి ఆయన వచ్చారని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలకు అధికార అహంకారంతో వాస్తవాలు గుర్తించడం మానేశారా ?
ప్రస్తుతం రెండుతెలుగు రాష్ట్రాల నేతల రాజకీయం చూస్తూంటే.. వాస్తవ పరిస్థితుల్ని పట్టించుకోకుండా.. తమకు తిరుగులేని అధికారం ఉందని.. ఇక్కడ కాకపోతే ప్రధానిగా ఢిల్లీలో చక్రం తిప్పగలమని వారు ఆశపడుతున్నారు. ప్రజాధనాన్ని అకౌంట్లలో జమ చేసి.. అది తాము చేస్తున్న మేలు అని పథకాలు అని ప్రచారం చేసుకుని.. ప్రధాని మోదీ ని ఢీకొట్టలమని వీరు అనుకుంటున్నారు. కానీ అదంతా తేలిక కాదని రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకున్న వారికైనా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంల పరిస్థితి మాత్రం ఇలాంటివి గుర్తించేంత స్థాయిలో లేదు.