ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారుతున్నారు. ముఖ్యంగా సౌత్ లాబీలో సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో ఒక్క కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు. అంటే.. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా మిగిలారు. ఈ మొత్తం వ్యవహారంలో కవిత పూర్తిగా ఇబ్బందుల్లో పడబోతున్నారా లేకపోతే.. కీలకమైన మార్పులు ఏమైనా జరగబోతున్నాయా అన్నది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
అందరూ కలిసి కవితను ఇరికించారా ?
ఢిల్లీ లిక్కర్ స్కాలో అప్రూవర్ల ఎపిసోడ్ నడుస్తోంది. తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ గా మారారు. ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఈయన కవిత తరపున బినామీగా వ్యవహరంచారని ఈడీ చెబుతోంది. ఆయన కూడా గతంలో తాను కవిత బినామీనేనని అంగీకరించారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానన్నారు. మళ్లీ ఇప్పుడు పూర్తిగా మనసు మార్చుకుని అప్రూవర్ గా మారారు. కవిత మద్యం బినామీ వ్యాపారం మొత్తం పిళ్లై పేరు మీదుగా సాగిందని ఈడీ, సీబీఐ చెబుతున్నాయి. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లు అయ్యారు. వారిద్దరూ సౌత్ లాబీ నుంచి కీలకం. ఇక కవిత ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు. ఇక సౌత్ లాబీలో మిగిలింది కవిత మాత్రమే.
లిక్కర్ స్కామ్ ను పక్కాగా పట్టిన ఈడీ, సీబీఐ
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తూ ఎల్జీకి ఫిర్యాదు చేశాయి. ఎల్జీ ఆదేశంతో మొదట సీబీఐ.. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగాయి. వరుసగా అరెస్టులు చేశాయి. అరబిందో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లైను బినామీగా పెట్టుకుని కవిత ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లుగా గుర్తించి కేసులు నమోదు చేసింది. విచారణ జరిపి దాఖలు చేసిన చార్జిషీట్లో కవిత బినామీ ఆస్తుల వివరాలనూ వెల్లడించింది.
కవిత ఎలా లబ్ది పొందాలో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు
ఢిల్లీలో మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్‌లో కవిత భూములు కొనుగోలు చేశారని, ఇందులో సౌత్‌గ్రూపుదే కీలకపాత్ర అని ఈడీ కోర్టుకు తెలిపింది. భూముల కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కుమార్ ప్రమేయం ఉందని తెలిపింది. గౌతమ్ మల్హోత్రా, అమన్‌దీప్, మాగుంట రాఘవ, అరుణ్ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. ఆప్ నేతలకు సౌత్‌గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది. తర్వాత అందర్నీ అంటే కవిత తరపున వ్యవహారాలు చక్క బెట్టినట్లుగా భావిస్తున్న అరుణ్ పిళ్లై, అభిషేక్ , బుచ్చిబాబు వంటి వారి వాంగ్మూలాలతో కవిత నేరం చేసినట్లుగా ఈడీ లెక్కలేసింది. వారందరూ దాదాపుగా అప్రూవర్లు అయ్యారు. ఒకరి తర్వాత ఒకరు మొత్తం నలుగురు, ఐదుగుర్ని అప్రూవర్లుగా మార్చేశారు. అప్రూవర్లు అంటే తాను నేరం చేశానని ఒప్పుకుంటున్నట్లే. స్కాంలో ఎవరి పాత్రేమిటి అన్నది వివరిస్తారు. దీంతో కవిత పాత్ర మొత్తం బయటకు వస్తుందని అనుకుంటున్నారు.