నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత.. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నేతను కూడా పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కావలి నియోజకవర్గానికి చెందిన మన్నెమాల సుకుమార్ రెడ్డి ( Mannemala Sukumar Reddy)పై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు నిర్ధారించి.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
‘పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గానికి చెందిన మన్నెమాల సుకుమార్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడమైనది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది’ అంటూ ప్రకటన విడుదలైంది.
కావలి నియోజకవర్గానికి చెందిన మన్నెమాల సుకుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే (Kavali Mla) రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (Ramireddy Pratap Kumar Reddy)కి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యేతో సుకుమార్ రెడ్డికి విభేదాలు మొదలయ్యాయి.. ఈ క్రమంలో పార్టీ ఆఫీస్ ఏర్పాటుకు సుకుమార్ సన్నాహాలు చేశారు సుకుమార్. దీంతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటుపడింది. అలాగే త్వరలో పార్టీ నేతలతో రీజినల్ కో ఆర్డినేటర్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి సమావేశంకానున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు, నేతల సస్పెన్షన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంద రాంనారాయణరెడ్డిలను సస్పెండ్ చేశారు. అంతకముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని కూడా పార్టీలో సస్పెషన్ వేటు పడింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు.. తాజాగా సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ చర్చనీయాంశమైంది.
సుకుమార్ రెడ్డి తనకు సోదర సమానుడంటూ గతంలో ఎన్నో సందర్భాల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన గెలుపులో కీలకపాత్ర పోషించారని ఆయనే స్వయంగా చెప్పారు. తన ప్రాణం కంటే ఎక్కువని.. తాను నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినా పార్టీ కేడర్‌కు అండగా ఉన్నారన్నారు. అలాంటి సుకుమార్‌రెడ్డిపై అధిష్టానం వేటు వేసింది. ఈ సస్పెన్షన్‌పై సుకుమార్ రెడ్డి స్పందించాల్సి ఉంది.