పాకిస్థాన్, చైనాకు కశ్మీర్ సందేశం

శ్రీనగర్ లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరుగుతోంది. 60 మంది దేశ, విదేశీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.భారత దేశ ప్రగతి, విశాల దృక్పధాన్ని అంచనా వేసేందుకు ఇలాంటి మీటింగులు ఏర్పాటు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీనగర్ ను సర్వాంగ సుందరమైన నగరంగా తీర్పిద్దిదారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ముందు నుంచే ఒక ప్రణాళిక ఉండటంతో రూ. 980 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును అమలు చేస్తోంది..

అరుణాచల్ లోనూ చైనాకు సందేశం

జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రెండు ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమేనని చెప్పేందుకు జీ-20 సదస్సులను భారత్ ప్రభుత్వం అక్కడ నిర్వహిస్తోంది. చైనా అభ్యంతరాలను సైతం లెక్క చేయకుండా ఈ ఏడాది మార్చిలో భారత ప్రభుత్వం జీ-20 వర్కింగ్ గ్రూపు మీటింగ్ నిర్వహించింది. అరుణాచల్ ప్రదేశ్లో ఈ కార్యక్రమం జరగడంతో చైనాకు బాగా కోపమొచ్చింది. భారత్లో అంతర్భాగమైన 11 ప్రదేశాలకు చైనా పేర్లు సూచిస్తూ ఒక మ్యాప్ ను విడుదల చేసి తన అక్కసును వెళ్లగక్కింది. అయినా పట్టించుకున్న వారు కనిపించలేదు.

చైనాలో చర్చలకే మొగ్గు

నిజానికి చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా.. అంతర్జాతీయ సమాజం అండదండలతో భారత ప్రభుత్వం శాంతి చర్చల వైపే మొగ్గు చూపుతోంది. గల్వాన్ ప్రతిష్ఠంభన తర్వాత డజనుకు పైగా ఆర్మీ కమాండర్ స్థాయి చర్చలకు భారత్ సహకరించింది. వివాదాస్పద అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకుందామని చెబుతూనే.. కశ్మీర్, అరుణాల్ ముమ్మాటికీ భారత్ లో అంతర్భాగమేనని, వాటిపై లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని చైనా, పాకిస్థాన్ ను హెచ్చరిస్తూనే ఉంది.

ఉగ్రవాదులను రెచ్చగొట్టిన పాకిస్థాన్

మూడో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాన్ని శ్రీనగర్లో జరగకుండా అడ్డుకునేందుకు పాకిస్థాన్ చేయని ప్రయత్నం లేదు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ఇష్టపడక, మన అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకుంటున్న పాకిస్థాన్… జీ-20 సదస్సును ఎలాగైనా ఆపాలని చూసింది. ముంబై దాడి తరహాలో ప్లాన్ చేయాలని తాను పెంచి పోషిస్తున్న ఉగ్రవాద గ్రూపులను ఆదేశించింది. ఇంటెలిజెన్స్ సంస్థలు, భద్రతా దళాలు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ కారణంగా ఈ కుట్ర భగ్నమైంది. దానితో పాకిస్థాన్ పాలకులు ఇప్పుడు తెల్లమొహం వేశారు.

ఉగ్రదాడి ప్రయత్నాలు బయటపడటంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. శ్రీనగర్ మొత్తం మూడంచెల భద్రతతో పాటు, మీటింగ్ జరిగే ప్రాంతంలో ఐదెంచల భద్రత ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. ఏదేమైనా కశ్మీర్ ను మళ్లీ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలబెట్టాలన్న భారత ప్రభుత్వ సంకల్పం నెరవేరడం మాత్రం ఖాయం…