దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కర్ణటకపై ఎక్కువ దృష్టి పెట్టింది. విజయావకాశాలను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల తరహాలో.. రాష్ట్రంలోని అన్ని లోక్ సభా స్థానాలను కైవసం చేసుకునేందుకు అపర చాణుక్యుడు అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కర్ణాటక నేతలకు కొన్ని అంశాలను బోధించారు. వాటిని పాటిస్తే జనంలో పార్టీ ఇమేజ్ పెరుగుతుందని చెప్పుకొస్తున్నారు..
ఇక జనంలోనే నేతలు..
అమిత్ షా మైసూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలతో రెండు సమావేశాలు ఏర్పాటు చేశారు. కొందరు నేతలు ఉదాసీనంగా ఉంటున్నారని పార్టీ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపడం లేదని అమిత్ షా ఆగ్రహం చెందినట్లుగా చెబుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఇంకా కొందరి పద్ధతి మారలేదని ఆయన మందలించారు.రాష్ట్ర పార్టీ స్థితిగతులను ఆయన విశ్లేషించారు. కర్ణాటకలో 28 లోక్ సభా స్థానాలుంటే గత ఎన్నికల్లో బీజేపీకి 26 వచ్చాయి. బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్ సుమలత ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ తలా ఒక స్థానాన్ని పొందాయి ఈ సారి కూడా సుమలతకు బీజేపీ మద్దతిచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 28 స్థానాలను బీజేపీ ఖాతాలో వేసుకునే దిశగా ప్రయత్నించాలని అమిత్ షా ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే నేతలంతా జనంలో తిరుగుతూ పార్టీ ఇమేజ్ ను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో పార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ దాని వల్ల రాష్ట్రాలకు కలిగిన ప్రయోజనాలను వివరించాలని చెప్పారు..
మోదీ పేరుతోనే ఎన్నికలకు…
దేశంలో ఇప్పుడు మోదీ ప్రభ వెలిగిపోతోంది. ఆర్టికల్ 370 రద్దుతో కర్ణాటకలో సైతం పార్టీ ఇమేజ్ పెరిగింది. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కారణంగా హిందువులకు ఇప్పుడు మోదీ తిరుగులేని నాయకుడయ్యారు. అటువంటి అంశాలను లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మోదీ నాయకత్వంలో దేశ పురోగతిని వివరిస్తూ ప్రచారం చేయాలని ఆయన అన్నారు. అప్పుడే జాతీయాంశాల ఆధారంగా ఎన్నికల ప్రచారం జరుగుతుందని ఆయన ప్రస్తావించారు..
10 శాతం ఓట్లు పెరగాలి..
2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అక్కడ 51 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి మరో పది శాతం పెరిగే విధంగా ప్రచార కార్యక్రమం ఉండాలని అమిత్ షా కర్ణాటక నేతలకు నూరిపోశారు.దీని వల్ల పార్టీ పటిష్టం అవుతుందని, గత ఎన్నికల్లో 32 శాతం ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బ కొట్టే వీలుంటుందని షా చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల శాతం బాగా పెరిగితే తదుపరి ఎన్నికల్లో సైతం ప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషించారు. అందుకోసం పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు శ్రమించాల్సిన అనివార్యతను వివరించారు. గావ్ చలో కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచించారు..