పాలిటిక్స్ బేడ.. అంటే రాజకీయాలు వద్దు అని కన్నడ సినీ పరిశ్రమ చాలా రోజులుగా చెబుతున్నట్లనిపిస్తోంది. రాజకీయ నాయకులతో రాసుకు పూసుకు తిరగడం,వారిని సినిమా ఫంక్షన్లకు పిలవడం, ఒకరిద్దరు నేతలకు మద్దతివ్వడం మినహా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు తక్కుువే. ఒకరిద్దరూ మాత్రమే రాణించారని చెప్పుకోవాలి. తెలుగు ఇండస్ట్రీలో ఈగ సుదీప్ గా పిలిచే కిచా సుదీప్ కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ కి మద్దతిచ్చారే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు..
రాజకీయాలకు దూరంగా కన్నడ సినిమా..
సినిమా ఇండస్ట్రీ ప్రజా మాధ్యమంగా మారుతున్న రోజుల్లోనే తమిళ నిర్మాత కే. సుబ్రమణియమ్ రాజకీయ సందేశాలతో సినిమాలు తీశారు. అన్నారురై, కరుణానిధి రాజకీయ సందేశాలతో సినిమా డైలాగులు, కథలు రాశారు. ద్రవడ ఉద్యమ ఊపు తమిళ సినిమాల్లో కనిపించేది. ఎంజీఆర్ హీరోగా నటించిన ప్రతీ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉండేవి. తెలుగు సినిమాల్లోనూ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ డైలాగ్స్ లో రాజకీయం ధ్వనించేది. సామాజిక న్యాయం కోసం పోరాడాలన్న తపన ఉండేది. ఎందుకనో కన్నడ సినిమాలో ఆ జోష్ కనిపించేది కాదు. రాజకీయాలను పెద్దగా పట్టించుకునే వారు కాదు..
తమిళనాడు, ఏపీలా కాకుండా..
తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్, నెపోలియన్ సహా పలువురు సినీ దిగ్గజాల రాజకీయాల్లో రాణించారు. మఖ్యమంత్రులుగా తమిళ నేలను పాలించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి అన్నగారు నందమూరి తారకరామారావు ప్రభంజనం ప్రపంచం మొత్తానికి తెలుసు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారానికి వచ్చిన సంస్కరణలకు పితామహుడిగా పేరు తెచ్చుకున్నారు.
రాజ్ కుమార్ ఆమడ దూరం…
కన్నడ కంఠీరవుడిగా పేరు పొందిన జన హృదయ నటుడు రాజ్ కుమార్ ఎప్పుడూ రాజకీయాల జోలికి పోలేదు. అదేమంటే తనకు తెలియని వృత్తిలో అడుగుపెట్టే ప్రసక్తే లేదన్నారు. 1977లో చిక్ మగళూరులో ఇందియాగాంధీ పోటీ చేసినప్పుడు జనతాపార్టీ తరపున పోటీ చేయాలని రాజ్ కుమార్ ను జార్జ్ ఫెర్నాండెజ్ అభ్యర్థించారు. తన వల్ల కాదని ప్రకటించిన రాజ్ కుమార్ ఎక్కడ వత్తిడి చేస్తారోనన్న భయంతో నామినేషన్ సమయం ముగిసే వరకు జనానికి కనిపించకుండా దాక్కున్నారు. కన్నడ నాడు పక్ష అనే పార్టీకి నాయకత్వం వహించాలని ఆహ్వానించినా రాజ్ కుమార్ పట్టించకోలేదు. రాజ్ కుమార్ ఫ్యాన్స్ 1985లో పోటీ చేసినప్పుడు వారికి తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించి చేతులు దులుపుకున్నారు..
రాణించిన కొందరు నటులు..
నటుడు అంబరీష్ రాజకీయాల్లో రాణించారు. గెలుస్తూ, ఓడుతూ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన భార్య సుమలత 2019 లోక్ సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. 1985 ప్రాంతంలో అనంతనాగ్, శంకర్ నాగ్ సోదరులు రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీలో చేరారు. ప్రచారం చేసి పార్టీని గెలిపించింది. శంకర్ నాగ్ చనిపోయిన తర్వాత 1991 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అనంతనాగ్ ఓడిపోయారు. 1994లో మల్లేశ్వరం అసెంబ్లీకి గెలిచి మంత్రి అయ్యారు. 2004లో ఓడిపోయారు. ఎం. చంద్రూ, శశి కుమార్ లాంటి నటులు ఎన్నికల్లో గెలిచినా తరచూ పార్టీలు మారారు. వాళ్లకి రాజకీయ సిద్ధాంతాలు ఉన్నట్లుగా కనిపించలేదు. బహుభాషా నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ కూడా పెద్దగా రాణించలేదు.
ఇప్పుడేమిటి…
బహుభాషా నటుడు ఉపేంద్ర కూడా రాజకీయాల్లో చేతులు కాల్చుకునేందుకు ప్రయత్నించిన సినీ దిగ్గజమే. ఉత్తమ ప్రజాకీయ పార్టీని స్థాపించిన ఆయన రాజకీయంగా ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.ప్రస్తుతం ఈగ సుదీప్ కూడా అర్థం లేని రాజకీయాలే చేస్తున్నారనుకోవాలి. ముఖ్యమంత్రి బొమ్మాయ్ తనకు ప్రియమైన అంకుల్ అయినందున మద్దతిస్తున్నానని, బీజేపీ పార్టీకి తనకు సంబంధం లేదని సుదీప్ చెప్పుకుంటున్నారు. అది విశ్లేషణలకు అందని లాజిక్ అనే చెప్పాలి. ఎందుకనో కన్నడ సినిమాకు, రాజకీయాలకు మ్యాచ్ కాలేదనే విశ్లేషించుకోవాలేమో…