మోదీ నేతృత్వంలో బీజేపీ వ్యూహాలకు పెట్టింది పేరుగా చెప్పుకోవాలి. ఎన్నికను బట్టి రాష్ట్రాన్ని బట్టి బీజేపీ తన మేనేజ్ మెంట్ టెక్నిక్స్ ను మార్చేస్తుంటుంది. త్వరలో ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్లోనూ రాజకీయ ప్రత్యర్థులను చావుదెబ్బ కొట్టేందుకు బీజేపీ రెడీ అయిపోయింది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి…
మోదీ మధ్యప్రదేశ్ పర్యటనకు వచ్చి వెళ్లిన కొద్ది గంటల్లోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను ప్రకటించింది. 230 సీట్లు ఉంటే అసెంబ్లీలో 39 మందితో మొదటి జాబితా అప్పటికే విడుదలై అభ్యర్థులు ప్రచారం ప్రారంభించగా, తాజా సోమవారం సాయంత్రం మరో 39 మందితో మలిజాబితాను ఆవిష్కరించారు. అేందులో ఏడుగురు సిట్టింగ్ ఎంపీల పేర్లతో పాటు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ పేరు కూడా ఉండటం పార్టీ వ్యూహానికి నిదర్శనంగా చెబుతున్నారు. బరిలోకి దిగుతున్న ఏడుగురు ఎంపీల్లో ముగ్గురు కేంద్ర మంత్రులు కావడం కూడా విశేషమేనని చెప్పుకోవాలి. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ను మోరేనా జిల్లా దిమానీ నియోజకవర్గం నుంచి బీజేపీ అధిష్టానం బరిలోకి దించుతోంది. కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఇప్పుడు మాండ్లా జిల్లా నివాస్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. నాలుగు సార్లు సాత్నా ఎంపీగా చేసిన గణేష్ సింగ్.. ఇప్పుడు సాత్నా నుంచే అసెంబ్లీ బరిలో ఉంటారు…
సామాజిక సమీకరణకు పెద్ద పీట
రెండో జాబితాలో అన్ని సామాజికవర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చినట్లుగా చెప్పుకోవాలి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళా ఎంపీ రితీ పాఠక్.. ఈ సారి సిథీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఓబీసీ వర్గానికి చెందిన లోథీ సామాజిక వర్గం నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింగ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. లోథీ సామాజిక వర్గం ప్రభావం కనిష్టంగా 40 నియోజకవర్గాల్లో ఉంటుందని గ్రహించిన బీజేపీ అధిష్టానం ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల్లకు రంగంలోకి దింపిందని భావిస్తున్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన ఉదయ్ ప్రతాప్ సింగ్ మూడో సారి ఎంపీగా ఉండగా… ఈసారి గదర్వారా అసెంబ్లీ సీటుకు బరిలో ఉంటారు. 2008 తర్వాత ఆయన అసెంబ్లీకి పోటీ చేయలేదు. గిరిజన సామాజిక వర్గాలు ఎక్కువగా ఉంటే మహాకోశల్ ప్రాంతంలో ఓటర్లను ఆకట్టుకునేందుకే కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తేను రంగంలోకి దించారు. తాజా జాబితాలో పది మంది ఆదివాసీ సామాజిక వర్గంవారున్నారు.
లోక్ సభకు కొత్త నీరు..
ఏకంగా ఏడుగురు ఎంపీలను అసెంబ్లీకి రంగంలోకి దించడం వారందరికీ విజయావకాశాలు మెండుగా ఉండటంతో మోదీ – అమిత్ షా – నడ్డా వ్యూహమేమిటో తేటతెల్లమవుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కొత్త వారికి (యువతకు) అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్న వారంతా మూడు నుంచి ఐదు సార్లు లోక్ సభకు గెలిచి ఉండటంతో వారి స్థానంలో కొత్త నీరు ప్రవహించాలని బీజేపీ లెక్కగడుతోంది. మరో పక్క ఇంతమంది వీఐపీ అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారంటే అది ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కష్టకాలమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే శివరాజ్ సీఎంగా ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి ఎవరో బీజేపీ ప్రకటించలేదు. మోదీని చూసి ఓటెయ్యమని మాత్రమే ప్రచారం చేసుకుంటోంది.