కాళహస్తి బీజేపీ సభ సక్సెస్ – నేతలకు నడ్డా అభినందన – ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోందా ?

తొమ్మిదేళ్ల ప్రధానమంత్రి మోదీ పాలన విజయోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన బహిరంగసభ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త ఉత్సాహం కల్పిస్తోంది. గతంలో చాలా పబ్లిక్ మీటింగ్‌లకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. అయితే ఎప్పుడూ లేనంత జోష్ ఆయనకు కనిపించింది. అందుకే సభను నిర్వహించిన బీజేపీ నేతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ బీజేపీ రైట్ ట్రాక్‌లో ఉందన్న సంతృప్తి ఆయనలో కనిపించింది. గతంలో తాను ఏపీలో పర్యటించినప్పటి పరిస్థితులు.. ఇప్పటి పరిస్థితులకు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఆయన సూచించినట్లుగా చెబుతున్నారు.

కలసి కట్టుగా తిరుపతి సభను సక్సెస్ చేసిన బీజేపీ నేతలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడి సభ ఖరారైన తర్వాత తక్కువ సమయమే ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ నేతలంతా ఏక తాటిపైకి వచ్చి సభను సక్సెస్ చేసేందుకు తిరుపతిలోనే మకాం వేశారు. రాయలసీమ కు చెందిన కీలక నేతలంతా తరలి వచ్చారు. ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తిరుపతితో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారిలో ఎక్కువ మంది సామాన్య ప్రజలే. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ఎక్కువగా ఉన్నారు. జేపీ నడ్డా బహిరంగసభపై నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో నేతలను సమన్వయం చేసుకున్నారు. ద్వితీయ శ్రేణి నేతల్ని యాక్టివ్ చేశారు. ఫలితంగా కాళహస్తి సభ అంచనాలను మించి విజయం సాధించింది.

ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు సాక్ష్యం

ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నదానికి సాక్ష్యంగా కాళహస్తి బీజేపీ సభ నిలిచిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు రెండూ బీజేపీతో సన్నిహితంగా ఉన్నాయని.. తామూ బీజేపీ ఒకటేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే బీజేపీ అధ్యక్షుడు నడ్డా.. తన ప్రసంగం ద్వారా బీజేపీ ఎవరికీ దగ్గర కాదని తేల్చి చెప్పారు. వైసీపీ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. జేపీ నడ్డా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇది మార్పునకు సంకేతంగా ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు.

బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వాలన్న ఆలోచన పెరుగుతోందా ?

ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని.. ఇక్కడి పార్టీల నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారన్న విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. కిరణ్ కమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మంజూరు చేసిన నీటి పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు. జగన్ కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి స్థానిక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగేలా బీజేపీ నేతలు చేశారు. అదే సమయంలో మార్చి మార్చి కొంత మంది నేతలకే ఎందుకు అధికారం ఇవ్వాలని.. బీజేపీకి ఒక్క చాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్న వాదననూ నేతలు ప్రజల ముందు పెట్టారు. ఇది ప్రజల్లో చర్చకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. బీజేపీ సభలకు పెరుగుతున్న ఆదరణ చూస్తే.. ఆ దిశగా ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.