పొత్తుల్లో భాగంగా బీజేపీకి కదిరి అసెంబ్లీ, హిందూపురం లోక్‌సభ – అభ్యర్థులెవరు ?

టీడీపీ ఎన్డీఏలో చేరేందుకు రావడంతో బీజేపీ కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ ముఖ్యనేతలంతా చట్టసభలకు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం పార్లమెంట్, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి బీజేపీ సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై స్పష్టత రావడంతోనే విష్ణువర్ధన్ రెడ్డిని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పని చేసుకోమని గతంలో సూచించినట్లుగా తెలుస్తోంది.

హిందూపురం లోక్ సభ అభ్యర్థిపై బీజేపీ హైకమాండ్ పరిశీలన

బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి లోకల్. ఆయన హిందూపురం పార్లమెంట్ పరిధిలో ప్రజా ఉద్యమాలు కూడా చేపట్టారు. ఇటీవల చురుకుగా నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. అయితే హిందూపురం నుంచి తాను కూడా పోటీ చేస్తానని ఇటీవల పరిపూర్ణానంద ముందుకు వచ్చారు. మీడియా ముందు ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవర్ని అభ్యర్థిగా హైకమాండ్ పరిశీలన చేస్తుందన్నది స్పష్టత లేదు.

కదిరి అసెంబ్లీ కూడా !

బీజేపీకి కదిరి అసెంబ్లీ నియోజకవర్గం కూడా కేటాయించనున్నట్లుగా చెబుతున్నారు. అయితే పార్లమెంట్ లేకపోతే కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయడం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా బీజేపీకి సేవ చేస్తున్న ఆయనకు ఈ సారి అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు. గతంలో రాష్ట్ర బీజేపీ కోసం… విస్తృతంగా పర్యటించేవారు. ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ కోసం పని చేసేవారు. ఇటీవల ఆయన పూర్తిగా నియోజకవర్గపై దృష్టిపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఏదో ఓ స్థానం నుంచి విష్ణువర్ధన్ రెడ్డిపోటీ ఖాయమే !

అనంతపురం జిల్లా బీజేపీలో యువనేతగా… భవిష్యత్ లో జాతీయ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్న నేతగా విష్ణువర్థన్ రెడ్డి ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఖాయమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ మేరకు వస్తున్న సూచనలతో విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పొత్తుల అంశంపై ఈ వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.