ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎప్పుడూ లేనంత జోష్ కనిపిస్తోంది. గన్నవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం మొత్తం సందడిగా జరిగింది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై తమ పోరాటం విషయంలో ఎక్కడా తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చార్జిషీట్ల ఉద్యమంలో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకూ నేతలంతా సీరియస్ గా పాల్గొనడంతో సూపర్ హిట్ అయింది. ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత అసంతృప్తి ఉందో అర్థం అయిందని వారి కోసం పోరాడి… వారి మద్దతును పొంది వచ్చే ఎన్నికల్లోగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న సంకల్పం నేతల్లో వ్యక్తమయింది.
గన్నవరం కాషాయం మయం !
గన్నవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం హాల్ కిక్కిరిసిపోయింది. గతంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కాస్త భిన్నంగా జరిగేవి. ఇలాంటి కార్యవర్గ సమావేశాలు ఏమైనా బీజేపీ పెట్టుకోగానే ఓ సెక్షన్ మీడియా .. కేంద్రం అది చేయలేదు.. ఇదిచేయలేదు అనే ప్రచారాన్ని ప్రారంభించేవారు. ఆ ప్రభావం కనిపించేది. కానీ ఈ సారి మాత్రం మీడియాకు అలాంటి సాకులు దొరకలేదు. బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చార్జిషీట్ల ఉద్యమం సీరియస్ నెస్ ను మీడియా కూడా గమనించింది. ప్రజల్లో బీజేపీకి వస్తున్న స్పందన పార్టీ నేతలందరికీ సంతృప్తి కలిగించింది. అందుకే ఎన్నికల ఎడాదిలో పార్టీ కార్యక్రమాలను మరింత ఉధృతం చేసే లక్ష్యంతో కార్యవర్గ సభ్యులు.. కింది స్థాయి క్రియాశీలక కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గన్నవరం వచ్చారు.
ప్రభుత్వంపై పోరాటానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఢిల్లీతో సత్సంబంధాలను కొనసాగిస్తూ.. ఏపీలో బీజేపీ .. తాము ఒకటే అనే అభిప్రాయాన్ని కల్పిస్తోంది. దీన్ని తిప్పి కొట్టడానికి బీజేపీ నేతల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేంద్రం సహకరిస్తున్నది ప్రభుత్వానికే కానీ .. వైసీపీకి కాదని మెజార్టి జనం నమ్ముతున్నారు. అందుకే వైసీపీపై పోరాటంలో బీజేపీతో కలిసి ప్రజా చార్జిషీట్ల వేసేందుకు పెద్ద ఎత్తున కలిసి వచ్చారని భావిస్తున్నారు. నియోజకవర్గ , రాష్ట్ర స్థాయి చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఇంకా భారీ కార్యాచరణ ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయి చార్జిషీట్ కార్యక్రమానికి జాతీయ నేతల్ని ఆహ్వానించాలనుకుంటున్నారు .
పొత్తులపై చర్చే లేదు.. పార్టీ బలోపేతమే లక్ష్యం !
ఏపీలో బీజేపీ లేకుండా పొత్తులపై చర్చ జరగడం లేదు. బీజేపీ.. బీజేపీ అని రాజకీయం మొత్తం కలవరిస్తోంది. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ఈ పొత్తుల సుడిగుండంలో తాము చిక్కుకోవాలని అనుకోవడం లేదు. ఏ నిర్ణయమైనా పూర్తిగా హైకమాండ్‌దేనని.. ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నారు. అయితే పొత్తుల గురించి ఆలోచించడం మానేసి.. ప్రభుత్వంపై పోరాటం ద్వారా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమాన్ని మాత్రం నిరంతరం కొనసాగించనున్నారు.
ఓ వైపు ఏపీ సర్కార్ వైఫల్యాలు..మరో వైపు మోదీ సర్కార్ విజయాల ప్రచారం!
ఏపీ బీజేపీ రెండు అస్త్రాలను రెడీ చేసుకుంది. ప్రజా చార్జిషీట్ల ద్వారా సిద్ధం చేసుకున్న సమస్యల జాబితాలో ప్రభుత్వంపై పోరాటం చేయడంతో పాటు కేంద్రం ద్వారా ఏపీకి లభిస్తున్న ప్రయోజనాలు.. ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆదరణ పొందాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం బీజేపీ నేతలు, క్యాడర్ అంతా..ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. ఎన్నికలకు ముందు గన్నవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యకవర్గ సమావేశం ఆ పార్టీలో ఎప్పుడూ కనిపించనంత పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చిందని క్యాడర్ సంతోషపడుతున్నారు.