ఐపీఎస్ ఆఫీసర్‌గా రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లో వెలిగిపోవాలనుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ పోలీస్ తెలివితేటలతో చేస్తున్న రాజకీయాలు తేలిపోతున్నాయి. ప్రతీ సారి అడ్డంగా దొరికిపోతున్నారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న ఆయనకు ఏ పార్టీ కూడా ఆహ్వానం పలకడం లేదు. దీంతో స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఆయన సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్రుల్ని ఘోరంగా అవమానించిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆయన విశాఖలో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం ప్రజల్ని మభ్య పెట్టే రాజకీయాలు ప్రారంభించారు. కానీ జేడీ పోలీస్ ఆలోచనలు రాజకీయాలకు సూట్ కావన్న విషయం ప్రతీ సారి బయట పడుతోంది.
స్టీల్ ప్లాంట్ కు మూలధనాన్ని సమకూరుస్తామని ప్రైవేటు కంపెనీతో కలిసి బిడ్డింగ్
విశాఖ స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూరుస్తామని జేడీ బిడ్ దాఖలు చేశారు. ఎలా అంటే.. క్రౌడ్ ఫండింగ్ చేస్తారు. ఏపీలో ఉన్న ఒక్కొక్కరు… ప్రతి నెలా వంద ఇవ్వాలట. ఆయన రాజకీయ తెలివితేటలకు జనం ఆశ్చర్యపోతున్నారు జరగదని తెలిసి కూడా ఇంతా కన్ఫిడెంట్ గా బిడ్ దాఖలు చేయడమే కాదు.. ర్యాలీలు గట్రా నిర్వహించి స్టీల్ ప్లాంట్ ను బిడ్డలా కాపాడుకోవాలని ఆయన చెబుతున్నారు. ఇక్కడ అసలు లాజిక్ వేరే ఉంది. అసలు స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూర్చితే స్టీల్ ఇస్తారు.. మరి ఆ స్టీల్ ను జేడీ ఏం చేస్తారు.? విరాళాలిచ్చిన వారికి పంపుతారా ?. అసలు తాను దాఖలు చేసిన బిడ్‌లో కనీసం ఓ పది కోట్ల సామర్థ్యం కూడా లేని ఓ విజయవాడ కంపెనీని భాగంగా చేశారు. దీంతో మరిన్ని విమర్శలు వస్తున్నాయి. అసలు ప్రైవేటీకరణ వద్దని ఉద్యమం చేస్తున్న ఆయన దాన్ని కొంటానని బిడ్ దాఖలు చేయజమే విచిత్రం అయితే.. స్టీల్ ప్లాంట్‌లో కనీసం ఓ చిన్న కాంట్రాక్టు పనికి కూడా అర్హత లేని కంపెనీని కలుపుకోవడం మరింత ఆశ్చర్యం.
అసలు బిడ్డింగ్‌కు అర్హతే లేదు.. ప్రాథమికంగానే తిరస్కరిస్తారు !
అసలు జేడీకి బిడ్డింగ్ వేసే అర్హత లేదు. ఏ బిడ్‌లో పాల్గొనాలన్నా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ లో ప్రధానంగా ఉండేది.. ఆ రంగంలో అనుభవం.. లేకపోతే ఆర్థిక శక్తి. జేడీదగ్గర రెండూలేవు. ముడి సరుకు లేదు. ముడి సరుకు గనులు లేవు. అంతకు మించి డబ్బులు లేవు. మరి బిడ్ కు ఎలా అర్హత సాధిస్తారు ? అలాంటి చాన్స్ లేదు. కానీ జేడీ ఇప్పుడు తానుపూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని ఆయ్యానని ప్రజల ఎదుట నిలబడుతున్నారు కానీ రాజకీయాలంటే ప్రజల్ని మభ్య పెట్టడమేనని.. దానికి తానూ తీసిపోనని నిరూపించడానికి జేడీ రెడీగా ఉన్నారు.
జేడీకి బీఆర్ఎస్ తప్ప మరో ఆప్షన్ లేదా ?
గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన … ఈ సారి కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ ఏపీలోని ఏ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందడం లేదు. వైసీపీ నుంచి ఆహ్వానం ఉన్నా చేరడానికి ఆయనకు మనసొప్పదు. మనసు చంపుకుని చేరితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూస్తూనే ఉన్నారు. ఇక టీడీపీ కూడా పిలవడం లేదు. ఆయన టీడీపీలో చేరితే జగన్ కేసులపై ప్రభావం పడుతుందని వారు పిలవడం లేదు. ఇక జనసేన పార్టీ నుంచి ఆయన అకారణంగా బయటకు వచ్చారు. అందుకే ఆయనను మళ్లీ పార్టీలోకి రావాలని పవన్ పిలవడం లేదు. జేడీ కూడా అడగడం లేదు. అదే సమయంలో ఏపీలో నేతల కోసం వెదుక్కుంటున్న కేసీఆర్ కు జేడీ కనిపించారు. చర్చలు కూడా జరిగాయని స్వయంగా జేడీ కూడా ప్రకటించారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో తామే కాపాడేశామని ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్కు జేడీ అండగా ఉంటున్నారు కాబట్టి ఆయన ఇక విశాఖ పట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలవడం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అందుకే అందర్నీ మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.