అయోధ్య రామాలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు అహర్నిశలు శ్రమపడుతూ పనులను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్య నగరాన్ని అందమైన నందనవనంగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణ అమలవుతోంది. బీజేపీ అజెండాలో ప్రధానమైనదిగా ఉన్న రామజన్మభూమి నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుమతివ్వడంతో పనులు చకచకా సాగుతున్నాయి. ఆ దిశగా విపక్షాల విమర్శలను పట్టించుకోకూడదని బీజేపీ నిర్ణయించుకుంది.
యోగి రెండు రోజుల పర్యటన
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామజన్మభూమిలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. హనుమాన్ గఢీని సందర్శించి పూజలు చేసిన తర్వాత ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. అయోధ్యను సుందరనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నారు. అయోధ్య నిర్మాణం తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తుందని యోగి చెప్పారు. దివ్య, భవ్య, నవ్య అయోధ్యను చూసేందుకు ప్రపంచ జనావళి ఉత్సాహంగా ఉందని యోగి చెప్పారు. అయోధ్య వచ్చిన ప్రతీ టూరిస్టు, యాత్రికుడు శాంతియుతంగా, ఆనందంగా, ఆధ్యాత్మిక చింతనతో, మనోల్లాసాన్ని పొందుతూ తిరుగు ప్రయాణం కావాలన్న ఆకాంక్షతోనే నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తాను అనునిత్యం ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నానని యోగి వెల్లడించారు. నిజానికి సాంకేతిక సమస్యలు, నేల వదులుగా ఉండటం లాంటి సమస్యలతో 2022లో కొన్ని రోజులు నిర్మాణ పనులు ఆగిపోయినా.. ఇప్పుడు అందుకు భిన్నంగా వేగం పుంజుకున్నాయి.
అందమైన ఆలయ ప్రాంగణం
రామాలయ ప్రాంగణం అందంగా తయారవుతోంది. ఆలయ అంతర్భాగంలోనే రాముడితో పాటు మహర్షి వాల్మీకి, మహర్షి విశ్వామిత్ర, మహర్షి వశిష్ట, నిషాద్ రాజ్, మాతా శబరి విగ్రహాలు కూడా సిద్ధమవుతున్నాయి. షింద్వార్, మహాపీఠ్ కూడా తుది రూపును సంతరించుకుంటున్నాయి. షాహద్ గంజ్ నుంచి నయాఘాట్ వరకు రామపథ్ నిర్మాణ పనులు 30 శాతం పూర్తయ్యాయని, డిసెంబరు 31 నాటికి ఆ పనులు పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. సరయూ నదీ జలాలు రామాలయంలోకి రాకుండా ఆపేందుకు గోడ(రీటైనింగ్ వాల్) నిర్మాణం పూర్తికావచ్చిందని దానికి తుది రూపు దిద్దితున్నామని అధికారులు చెప్పారు.
మాంసాహారం, మద్యం నిషేధం ?
అయోధ్య నగరాన్ని ఒక శాంతియుత, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని యోగి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే జనవరి ఒకటిన రామాలయ ప్రారంభోత్సవం జరిగినప్పటి నుంచి ఆ నగర పరిధిలో మాంసాహారం, మద్యం విక్రయాలను నిషేధించాలని యోగి ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి శాఖాహార నగరంగా మార్చెయ్యాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెబుతున్నారు. అయోధ్యను అభివృద్ధికి మోడల్ గా రూపుదిద్దే ప్రక్రియ ఊపందుకుంది. నగరమంతా 24 గంటలు తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం వాటర్ యాక్షన్ ప్లాన్, వాటర్ బ్యాలెన్స్ ప్లాన్ ను అమలు చేయబోతున్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను త్వరగా సిద్ధం చేయాలని కూడా యోగీ ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రయోజనాన్ని ఆశించి అయోధ్య అభివృద్దికి వేల కోట్లు వ్యయం చేస్తున్నారు. అయోధ్య వచ్చే యాత్రికలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు, ప్రభుత్వాధికారులను ఆదేశించారు.