టీడీపీ మరింత దగ్గరైన జనసేన – చంద్రబాబు అరెస్ట్‌తో మారిన ఏపీ రాజకీయం

ఏపీ రాజకీయాలు మరింతగా మారిపోయాయి. చంద్రబాబును అరెస్ట్ చేయడంపై జనసేన అధినేత చూపించిన స్పందన రాజకీయ సమీకరణాలను మార్చేసింది. పరిణామాలు మూడు రోజుల్లో వేగంగా మారిపోయాయి. పవన్ లోకేష్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కలసి పోరాడదామన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితిలో మార్పు స్పష్టంగా కనపడుతోంది. నేరుగా పవన్ మద్దతు తెలిపారు. చంద్రబాబుకి మద్దతుగా జిల్లాల నుంచి టీడీపీ నేతలతోపాటు, జనసేన నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేశారు. చంద్రబాబుకి మద్దతు తెలిపారు. బంద్ కూడా కలిసి చేశారు.

బీజేపీతో చర్చించని జనసేన

జనసేన పార్టీ అధికారికంగా బీజేతో పొత్తులో ఉంది. కానీ కొన్ని విషయాల్లో అసలు బీజేపీతో కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు. రెండు వైపుల నుంచి చొరవ కనిపించడం చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయని జనసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో టీడీపీకి పోటీగా మెసేజ్ లు పెట్టారు, వైసీపీని ట్రోల్ చేశారు. పవన్ కల్యాణ్ ని ఏపీకి రాకుండా పోలీసులు చేసిన ప్రయత్నం వారిలో మరింత కసి రాజేసింది. చంద్రబాబు అరెస్ట్ ని ఖండించిన జనసేన నేతలు, తమ నాయకుడి విషయంలో కూడా తేడా జరిగే సరికి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ అరెస్ట్ బై బీజేపీ నుంచి పెద్దగా స్పందన రాలేదన్న అభిప్రాయం ఉంది.

టీడీపీతో ఎన్నికలకు వెళ్లేందుకే జనసేన సిద్ధం

ఇప్పటికిప్పుడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే జనసేనకు పెద్దగా మేలు జరగదనే విషయం అందరికీ తెలుసు. అయితే టీడీపీతో పొత్తుకు వెళ్తే వాళ్లు ఇచ్చే సీట్లతో సర్దుకోవాలి. పొత్తు లేకుండా సొంతగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి లాభం చేకూర్చినట్టవుతుంది. గతంలో పవన్ కల్యాణ్ కూడా ఇదే విషయంలో పార్టీ క్యాడర్ కి సర్దిచెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన అంత విశదీకరించి చెప్పాల్సిన పరిస్థితి లేదు. జనసైనికులకు కూడా సీన్ అర్థమైంది. చంద్రబాబుపై వైసీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, రేపు పవన్ కల్యాణ్ పై కూడా ఇలాగే కక్షసాధిస్తారని అంటున్నారు జనసైనికులు. పవన్ ని ఏపీకి రాకుండా అడ్డుకోవడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.

జనసైనికులూ ఫిక్సయినట్లేనా

వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో జట్టుకట్టాలనుకుంటున్నారు జనసైనికులు. టీడీపీతో కలసి వెళ్లాలనేది ఇన్నాళ్లూ జనసేనాని ఆలోచనగానే ఉండేది, కానీ ఇప్పుడది జనసైనికుల ఆలోచనగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరు పార్టీకి, నేతలకు నష్టం చేకూరుస్తుందని వారు డిసైడ్ అయ్యారు. టీడీపీ, జనసేన మధ్య అపోహలు తొలగిపోయి, జట్టుకట్టడానిక సీఎం జగన్ ఓ అవకాశం ఇచ్చినట్టు అర్థమవుతోంది.