కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేయగానే.. జమిలీ ఎన్నికలపై రకరకాల చర్చలు నిర్వహిస్తున్నారు. కానీ జమిలీ ఎన్నికలు అనేవి కొత్త కాదు. దేశ స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో జమిలీ జరిగాయి. ఇప్పటికీ లోక్ సభతో పాటు పలు రాష్ట్రాలకు జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఏపీ కూడా ఉంది.
ఉమ్మడి ఏపీకి ఎనిమిది సార్లు జమిలీ ఎన్నికలు
పార్లమెంటుతో పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి. మరో ఐదు సార్లు విడివిడిగానే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. క్రమేపీ విడివిడిగానే ఎన్నికలు జరిగే రాష్ట్రాల సంఖ్య పెరిగిపోతోంది. సగటున ఐదారు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. లోక్సభనుగానీ, రాష్ట్రాల శాసనసభలనుగానీ పదవీకాలం (ముగిసే లోపు తగిన కారణాలతో రద్దు చేసి ముందస్తు లేదా మధ్యంతర ఎన్నికలు జరిపించే వెసులుబాటు భారత రాజ్యాంగం కల్పిస్తోంది. మొదట్లో అధికంగా పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, క్రమేపీ ఆ సంఖ్య తగ్గిపోయింది. జాతీయ పార్టీల ప్రభావం తగ్గి, ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరగడం వెరసి రాష్ట్రాల్లో పూర్తిస్థాయి ప్రభుత్వాలు కొనసాగక, ఎన్నికల షెడ్యూలు మారింది. 20 ఏళ్లుగా దేశంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల సంఖ్య బాగా పడిపోయింది.
2018లో జమిలీ వద్దనుకున్న ముందస్తుకు వెళ్లిన తెలంగాణ
2014లో ఉమ్మడి ఏపీకి జమిలీ జరిగాయి. లోక్ సభతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరిగాయి.కానీ జమిలీ వద్దనుకున్న తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్ 2018లోనే ఎన్నికలకు వెళ్లింది.
దీంతో 2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు కేవలం ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకే పోలింగ్ జరిగింది. 2004, 2009, 2014లో పార్లమెంటుతో పాటే ఉమ్మడి ఏపీ అసెంబ్లీలకూ ఎన్నికలు జరిగాయి. 2014 నాటికి ఏపీ విభజన ప్రక్రియ పూర్తికాకపోవడంతో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు పార్లమెంటుతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్లుగానే భావిస్తున్నారు. తెలంగాణ మొదటి అసెంబ్లీ పదవీకాలం ముగియడానికి ఆర్నెళ్ల ముందే దాన్ని రద్దుచేయించి 2018 డిసెంబరులో ఎన్నికలు నిర్వహించారు. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం లేకుండా పోయింది.
ఓటర్ల ఆలోచనల్లో మార్పు రాదు !
17వ లోక్‌సభ ఎన్నికలతోపాటు 2019 ఏప్రిల్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి కొన్నిసార్లు పార్లమెంటుతో పాటు మరికొన్ని సార్లు విడిగా ఎన్నికలు జరిగాయి. జమిలీ ఎన్నికలు జరగడం వల్ల జాతీయ పార్టీలకు మేలు జరుగుతుందన్న ఓ లాజిక్ లేని విశ్లేషణచేస్తూ ఉంటారు. కానీ జమిలీ జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల తీరును చూస్తే.. అక్కడి ప్రజలు స్పష్టమైన ఆలోచనతోనే ఓట్లేశారని అర్థం చేసుకోవచ్చు.