కేంద్ర ప్రభుత్వ నిధులతోనే .. రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న ఏపీ ప్రభుత్వం ప్రధాని మోదీని అవమానించేలా వ్యవహరిస్తూండటం వివాదాస్పదమవుతోంది. కేంద్ర నిధులు ఉన్న పథకాల్లో ఒక్క చోట ప్రధానమంత్రి ప్రస్తావన తీసుకు రావడం లేదు. చివరికి కేంద్రం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం విషయంలోనూ అదే పని చేస్తున్నారు. ఈ బియ్యం పథకానికి కూడా జగన్ స్టిక్కర్లు వేసి పంపిణీ చేస్తున్నారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.
కేంద్రం ఉచిత బియ్యంపై జగన్ స్టిక్కర్
కేంద్ర పథకాలకు మీ స్టిక్కర్లు , రంగులు ఏంటీ .అంటూ జగన్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.. ఈ మేరకు తాజాగా సోము సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. కేంద్ర పథకాలపై మీ స్టిక్కర్లు ఏంటి? టూ సీఎం జగన్ ను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పథకంపై రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ ఎలా అంటిస్తారని ప్రశ్నించారు. బియ్యం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఉచిత బియ్యం అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని రేషన్ బియ్యం వాహనాలపై ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని సోము డిమాండ్ చేశారు.
కేంద్ర పథకాల విషయంలో అనేక మార్గదర్శకాలు – పాటించని ప్రభుత్వం
కేంద్ర పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మార్గదర్శకాలు అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఏ పథకం కింద నిధులు అందిస్తుందో ఆ పథకం పేరును ఖచ్చితంగా ప్రచారంలో ఉంచాలి. ఆ పథకం కింద ప్రజలకు అందుతున్నట్లుగా ప్రజలకు తెలియాలి. అయితే ఇలాంటి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా పాటించడం లేదు. ఇంత కాలం వేచి చూసిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు మాత్రం ఊరుకోవడం లేదు. తమదైన రీతిలో పోరాటం చేస్తున్నారు.
పథకాల్లో నిధులు కేంద్రం చలువే !
కేంద్రం ఏపీ ప్రభుత్వానికి కావాల్సినన్ని నిధులు ఇస్తున్నప్పటికీ.. ఏమీ ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారు. సీఎం బటన్ నొక్కే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలేనని.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులా ఈ పథకాలు ప్రజల ముందుకు దూసుకొస్తున్నాయని చెబుతున్నారు. కానీ, ప్రధాని మోదీ గొప్పతనం ప్రజలకు తెలియకూడదనే దుర్బుద్ధితో సీఎం తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 2.26 కోట్ల మందికి రేషన్ బియ్యం అందిస్తున్నామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని- కేంద్ర పథకాల విషయంలో మార్గదర్శకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. సీఎంకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు.