ఎవరైనా గెలిచిన తర్వాత పదవుల కోసం కొట్లాడుకుంటారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం గెలవక ముందే.. ఎన్నికలలో పోరాటం కన్నా ముందు పదవులు మాకంటే మాకని కొట్లాడుకుంటారు. ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో అంతే….. ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సిన తెలంగాణలోనూ అంతే. ఆలూ చూలూ లేదని క్యాడర్ ఏడుస్తూంటే.. సీఎం పదవి మాకేనని కుస్తీపట్లు ప్రారంభించేశారు.
కర్ణాటకలో సిద్దరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ వర్సెస్ ఖర్గే
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇంకా గెలవనే లేదు కానీ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడే సీనియర్లు పార్టీని ఓటమి దిశగా తీసుకెళ్తున్నారు. టీ పీసీసీ చీఫ్ గా డీ కే శివకుమార్ ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అనుకుంటున్నారు. కానీ మాజీ సీఎం సిద్ధరామయ్య మాత్రం తానే రేసులో ఉన్నానంటున్నారు. డీకేకు సీఎం కావాలని ఉన్నా వంద శాతం తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని సిద్ధూ ఇటీవలే ప్రకటించుకున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబం ఇష్టం మేరకు నిలబడి గెలిచిన మల్లిఖార్జున్ ఖర్గేకు సీఎం కావాలని ఉంది. ఆయన కూడా కర్ణాటక అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకున్నారు. దీంతో ఈ ముగ్గురూ మధ్య ఓ టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. వీరి వర్గ పోరాటంతో కాంగ్రెస్ అవకాశాలు దెబ్బతింటున్నాయని క్యాడర్ వాపోతున్నారు. కానీ ఎవరి రాజకీయం వారిది.
తెలంగాణలో అసలు చాన్సే లేకపోయినా సీఎం పోస్టుపై ప్రకటనలు
తెలంగాణలో అయితే ఇంకా ఎక్కువ హడావుడి చేస్తున్నారు నేనే సీఎం అవుతా అని రేవంత్ రెడ్డి పరోక్షంగా చెబుతూంటే.. నాకేం తక్కువ భట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు. వారిద్దరేనా ఇంకా బయటపడని చాలా మంది సీనియర్లు.. తాము మాత్రం తీసిపోయామా అని అనుకుంటూ ఉంటారు. వీరంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరో విధంగా చర్చకు పెడుతున్నారు. మల్లు భట్టి విక్రమార్క హైకమాండ్ చాన్సిస్తే ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నారు. ఇందిరమ్మరాజ్యం తెస్తానని శపథం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి మాస్ లీడర్. టీ పీసీసీ చీఫ్ గా కూడా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆయనే సీఎం అవుతారన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఆయనను సీఎం కాకుండా చేయడానికి సీనియర్లు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దళిత సీఎం అనే వాదన కూడా తీసుకు వచ్చారు. అంతర్గత రాజకీయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తామంతా కష్టపడి ఆయనను ఎందుకు సీఎం చేయాలని కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసి పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఆయన సోదరుడు మాత్రం కాంగ్రెస్ లో ఉన్నారు కానీ ఆయనదీ అదే అభిప్రాయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కాంగ్రెస్‌ను ఎవరో ఓడించాల్సిన పని లేదు !
కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించుకుంటుంది అనే సెటైర్ ఆ పార్టీపై ఉంటుంది. ఎంతకు దిగజారిపోయినా ఆ సెటైర్ ఎప్పటికప్పుడు నిజం అవుతూనే ఉంది. ముందు ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత పదవులు వస్తాయి. అప్పుడు పదవుల కోసం కొట్లాడుకోవచ్చు. అసలు ఇంకా ఎన్నికల్లో గెలవకుండానే.. గెలుస్తారన్న పెద్దగా ఆశలు లేకుండానే పదవుల కోసం కొట్లాడటం కాంగ్రెస్ నేతలకే చెల్లింది. గెలిస్తేనే పదవుల రేస్ ఉంటుంది. ఓడిపోతే రాజకీయ భవిష్యత్ క్లోజ్ అవుతుంది. కానీ ఈ విషయాలను కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదు. తాము సీఎం అయితేనే కాంగ్రెస్ గెలవాలన్నట్లుగా వారి తీరు ఉంది. అందుకే ప్రజల ముందు నవ్వుల పాలవుతోంది.