కొట్టినది హిందూ మహిళలు కాదు.. కొట్టుకున్నది క్రైస్తవులు

దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది హిందువులకు ఆపాదించడం పరిపాటిగా మారింది. ఏ గొడవ జరిగినా దానికి మతం రంగు పులమటం ఫ్యాషన్ గా మారిపోయింది, కుహనా లౌకికవాదులంతా కలిసి హిందువులపై విరుచుకుపడేందుకు అలాంటి సంఘటనలు ప్రచారం చేస్తున్నారు. పైగా ఉన్నది లేనిదీ కలిపి ఫుల్లు పబ్లిసిటి ఇస్తారు. జరిగిందొక్కటైతే సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యేది మరోకటిగా మారుతోంది. అనేక సందర్భాల్లో ఫ్యాక్ట్ చెక్ చేసి జరుగుతున్న ప్రచారం తప్పు అని తేల్చినా మళ్లీ మళ్లీ అలాంటి ప్రచారాలే తెరపైకి వస్తున్నాయి.

కేరళ కుట్టీల దెబ్బలు

కేరళ త్రిశూర్ లో అమ్మాయిలు ఓ వ్యక్తిని పిచ్చకొట్టుడు కొడుతున్న వీడియో కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది. పైగా అతను ముస్లిం అని కొందరు, కాదు కేరళ మంత్రి అని కొందరు సోషల్ మీడియా ప్రచారాలు చేశారు. పైగా మత విద్వేషాలను రెచ్చగొట్టినందున అమ్మాయిలు అతనికి దేహశుద్ధి చేశారని థంబ్ నెయిల్స్ పెట్టేశారు.ఇంకేముంది హిందువులతో పెట్టుకుంటే మాడిమసైపోతావ్ అని ముందు వెనుకా చూసుకోకుండా కొందరు హెచ్చరికలతో కూడిన కామెంట్స్ కూడా పెట్టారు. దుర్గామాత కన్నెర్ర చేసిందని కొందరు, శక్తి స్వరూపిణులైన మహిళలు ఆగ్రహం చెందితే ఎలా ఉంటుందో ఈ వీడియో నిరూపిస్తుందని మరికొందరు పోస్టులు పెట్టి వీడియో లింక్ చేశారు. పైగా కేరళలో మత స్వేచ్ఛ లేదని ప్రచారం చేసే బ్యాచ్ ఒకటి తయారైపోయింది.

చర్చి వివాదంలోనే దాడి

అసలేం జరిగిందని తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. కొన్ని సామాజిక మాధ్యమాలు ఫ్యాక్ట్ చెక్ చేశాయి. దానిలో అందులో ఎలాంటి మత వివాదమూ లేదని, కొట్టిన వాళ్లు కూడా హిందువులు కాదని తెలిసింది. త్రిశూర్ లోని జియోన్ చర్చిలో చెలరేగిన ఒక వివాదమే ఆ వ్యక్తిపై మహిళల దాడికి కారణమని నిర్థారించారు. ఒక వ్యక్తి చర్చికి వస్తూనే సంస్థ పెద్ద మీద వ్యతిరేక ప్రచారం ప్రారంభించాడు. పైగా చర్చి ఫాదర్, ఇతర ఉద్యోగులు మార్ఫింగ్ ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఆ క్రమంలో చర్చికి వచ్చే కొందరు మహిళల పట్ల కూడా అసభ్య కామెంట్స్ పెట్టాడు.

చిర్రెత్తుకొచ్చి చితక్కొట్టిన వైనం

తొలుత ఆ వ్యక్తికి మర్యాదగా ఉండాలని చెప్పేందుకు ప్రయత్నించారు. చర్చి వైపు రావద్దని హెచ్చరించారు. అయినా అతను తన అలవాట్లను మానుకోలేదు. చర్చి పెద్దలపై దుష్ర్పచారం చేస్తూనే ఉన్నాడు. చర్చికి కూడా వస్తూ తగవులు పెట్టుకున్నాడు. దానితో కోపం వచ్చిన మహిళలు అతనిపై దాడి చేశారు. అక్కడ కొట్టినోళ్లు, కొట్టించుకున్నోడు ఇద్దరూ క్రైస్తవ వర్గాలకు చెందిన వ్యక్తులే. కాకపోతే కొందరు వీడియో దొరికింది కదాని హిందువులకు ఆపాదించే ప్రయత్నం చేశారు.ఏదో విధంగా హిందూ వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకోవాలనుకున్నారు. ఫ్యాక్ట్ చెక్ చేయడం ద్వారా అలాంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లయ్యింది.