ఏపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా ? లేదా ? అనే అంశంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. టీడీపీతో పొత్తు ఉంటుందనే బీజేపీ జాతీయ నాయకత్వం సంకేతాలు ఇస్తుంది. సీట్ల సర్దుబాటు వ్యవహారంపై స్పష్టత వచ్చిన తర్వాతే పొత్తులపై క్లారిటీ వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లి.. బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
పవన్ ఢిల్లీ టూర్ కు బ్రేక్
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడటంతో… ఆయన విజయవాడ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతారని భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు, సీట్ల పంపకం అంశంపై చంద్రబాబుతో.. పవన్ మంతనాలు జరుపుతారని సమాచారం. జనసేనకు మెజార్టీ సీట్లు కేటాయించాలని పవన్ ను.. నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటి వరకు పొత్తులో భాగంగా జనసేనకు 25 నుంచి 27 అసెంబ్లీ, మూడు ఎంపీ స్థానాలు ఖాయమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సంఖ్యతో జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు సుముఖంగా లేరు. టీడీపీకి పూర్తిగా సహకరిస్తున్న తమకు కనీసం 40 స్థానాలు కావాలని జనసేన నేతలు పట్టు బడుతున్నారు.
సీట్ల ప్రతిపాదనలపై బీజేపీలో అసంతృప్తి ?
ఈ క్రమంలోనే పొత్తుల విషయంలో ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పవన్ జనసేన శ్రేణులకు సూచించారు. ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు ఖాయమైనట్లు తెలుస్తుండగా.. బీజేపీ నుంచి 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు కోరినట్లు ప్రతిపాదన వచ్చిందని పార్టీ వర్గాలలో చర్చించుకుంటున్నారు. చంద్రబాబు తన పార్టీ ముఖ్యులతో చర్చ అనంతరం.. జనసేన, బీజేపీ లకు కలిపి కు 40 అసెంబ్లీ, 9 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీజేపీకి తమ ప్రతిపాదనలను పంపినట్లు విశ్వస నీయ సమాచారం.
బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకే తదుపరి అడుగులు
ఏపీలో పొత్తుల అంశంపై బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకే తదుపరి అడుగులు పడనున్నాయి. ఇందు కోసం మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఏపీలో అన్ని పార్టీలు బీజేపీకి అనుకూలంగానే ఉన్నందున.. ఏ నిర్ణయం బీజేపీకి లాభమో..అదే తీసుకునే అవకాశం ఉంది.