ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటానికి సిద్ధమయింది. మే 5 నుంచి 15 వరకూ పది రోజులు పాటు పోరాటం చేయాలని ఏపీ బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం అయింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ అంటే వైసీపీకి అనుకూలం అన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోందని… కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజ్యాంగ పరంగా ఉండే సంబంధాలను చూపి అలాంటి వాతావరణాన్ని సృష్టించారని దాన్ని పటాపంచలు చేసి ప్రజలకు నిజాలు చెప్పాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఏపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మే నెలలో 10 రోజులపాటు నిరసన, ఆందోళనతో పోరాట కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
వైసీపీ పాలనపై చార్జిషీట్లు
కుటుంబ పార్టీలకి బీజేపీ వ్యతిరేకమని ఈ విషయంలో తమ విధానాల్లో మార్పేమీ ఉండదని కోర్ కమిటీ స్పష్టం చేశారు. తాము జనసేన తోనే ఉన్నామని, జనసేనతోనే కలిసి వెళ్లాలని.. జనసేనతో కలిసి కార్యక్రమాల రూపకల్పనకు ప్రణాళిక సిద్దం చేయనున్నారు. రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతుందని .. వ్యవస్థలు నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైఎస్ జగన్ అరాచకాలపై కోర్ కమిటీలో నిర్ణయాలు తీసుకున్నారు. మే 15 నుంచి జూన్ 15 వరకు ప్రధాని మోదీ పాలన రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ ప్రచార భేరి నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీకి మోదీ సర్కార్ సాయంపై ప్రచార భేరీ
క్షేత్ర స్థాయిలో వాగ్దానాలు.. ప్రభుత్వ తప్పిదాలు, భూ కబ్జాలపై కోర్ కమిటీలో చర్చించారు. ఏదో అద్భుతాలు చేస్తానని చెప్పిన సీఎం జగన్ ప్రజల్ని మోసం చేసిన దానిపై రాష్ట్ర జిల్లా స్థాయిలో చార్జ్ షీట్స్ బయటకు తియ్యాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భూ దందా… కబ్జాలు, ఇసుక మాఫియా సమస్యతో పాటు మద్యాన్ని నిషేధించాలని వీటిన్నిటిపై ఏపీ బీజేపీ నేతలు ఉద్యమం చేయ్యాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం మోగించి… మే 5 నుండి 16 వ తేదీ వరకు రాష్ట్ర జిల్లా స్థాయిలో చార్జిసీట్ తీసుకువచ్చే కార్యక్రమాలు చేపట్టాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
జనసేనను కలుపుకుని ప్రజాపోరాటాలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక
జనసేన నేతలకు కూడా ఈ కార్యక్రమాలు వివరించి కలిసికట్టుగా వేళ్లేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు. వైసీపీతో బీజేపీ కలిసికట్టుగా వెళ్తుందని… అసత్య ప్రచారం జరుగుతుంది దాని తిప్పి కొడదాం అని పార్టీ శ్రేణులకు కోర్ కమిటీ పిలుపునిచ్చింది. గతంలో తెలుగు దేశం కూడా రాష్ట్రంలో అరాచకాలు చేసిందని… కుటుంబ పాలన పార్టీలకి బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమేనని … అచ్చెన్నాయుడు, పితాని ఏదో ఊహించి మాట్లాడుతున్నారని…. కేంద్ర పెద్దలలో కూడా జనసేనాని పవన్ భేటీ అయ్యారని కోర్ కమిటీ గుర్తు చేసింది. జనసేన, బీజేపీ పరస్పరం గౌరవించుకుంటూ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందుకు వెళతామని స్పష్టం చేశారు.